వైద్య చికిత్సల కోసం విదేశాలకు వెళ్లే రోగులకు భారత్ గమ్యస్థానంగా మారుతోంది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం, అత్యాధునిక వైద్య సదుపాయాలు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండటంతో అంతర్జాతీయ రోగులు భారత్ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా గుండె శస్త్రచికిత్సలు, అవయవ మార్పిడి, క్యాన్సర్ చికిత్స, సంతాన సాఫల్య చికిత్సలు, ఎముకలకు సంబంధించిన వైద్య సేవల కోసం విదేశీయులు భారత్‌కు వస్తున్నారు.
2023 నుంచి 2025 మధ్య కాలంలో 18 లక్షల మందికి పైగా విదేశీయులు వైద్య చికిత్సల కోసం భారత్‌ను సందర్శించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దక్షిణాసియా దేశాలతో పాటు ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా దేశాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు ఇక్కడికి వస్తున్నారు.
భారత్‌లో వైద్య చికిత్సల ఖర్చు ఇతర దేశాలతో పోలిస్తే తక్కువగా ఉండటం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఉదాహరణకు దుబాయ్‌లో సుమారు లక్ష డాలర్లు ఖర్చయ్యే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స భారత్‌లో దాదాపు 30 వేల డాలర్లకే అందుబాటులో ఉందని నిపుణులు చెబుతున్నారు. తక్కువ ఖర్చుతో పాటు అనుభవజ్ఞులైన వైద్యులు, అత్యాధునిక ఆసుపత్రులు, అధునాతన డయాగ్నస్టిక్ సదుపాయాలు కూడా విదేశీ రోగులను ఆకర్షిస్తున్నాయి. థాయ్‌లాండ్, టర్కీ, శ్రీలంక వంటి దేశాలతో భారత్ వైద్య పర్యాటక రంగంలో పోటీ పడుతోంది.
() ఢిల్లీ-ఎన్‌సీఆర్
గుండె శస్త్రచికిత్సలు, క్యాన్సర్ చికిత్స, అవయవ మార్పిడి, న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్ వంటి విభాగాల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతం ప్రముఖంగా నిలుస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రత్యేక వైద్య సేవలు, వివిధ భాషల్లో సహాయం అందించే సిబ్బంది అందుబాటులో ఉండటం ఈ ప్రాంతానికి అదనపు ప్రయోజనం.
()ముంబై
క్యాన్సర్ చికిత్స, గుండె సంబంధిత వ్యాధులు, అవయవ మార్పిడి, క్లిష్టమైన శస్త్రచికిత్సల కోసం విదేశీ రోగులు ముంబైకి వస్తున్నారు. ఇక్కడి ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు, ప్రత్యేక వైద్య బృందాలు అందుబాటులో ఉన్నాయి.
()చెన్నై
ప్రత్యేక వైద్య సేవలకు చెన్నై మంచి గుర్తింపు పొందింది. గుండె చికిత్సలు, అవయవ మార్పిడి, ఎముకలకు సంబంధించిన సమస్యలు, క్యాన్సర్ చికిత్స, క్లిష్టమైన శస్త్రచికిత్సల కోసం విదేశీ రోగులు ఈ నగరాన్ని ఎంచుకుంటున్నారు. పొరుగు దేశాల నుంచి వచ్చే రోగులకు కూడా చెన్నై ప్రధాన వైద్య కేంద్రంగా మారింది.
()హైదరాబాద్
అత్యాధునిక వైద్య మౌలిక సదుపాయాలతో హైదరాబాద్ అంతర్జాతీయ వైద్య కేంద్రంగా ఎదుగుతోంది. క్యాన్సర్ చికిత్స, గుండె వైద్యం, రోబోటిక్ సర్జరీలు, అవయవ మార్పిడి, అధునాతన వైద్య పరీక్షల కోసం ఇక్కడి ఆసుపత్రులకు విదేశీ రోగులు వస్తున్నారు. పెరుగుతున్న ఆసుపత్రుల సంఖ్య, అంతర్జాతీయ విమాన కనెక్టివిటీ, ప్రత్యేక వైద్య సేవలు హైదరాబాద్‌కు కలిసొస్తున్నాయి.
() బెంగళూరు
ఆంకాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, సంతాన సాఫల్య చికిత్సల్లో బెంగళూరు ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య సేవలు, నిపుణులైన వైద్యులు ఈ నగరాన్ని విదేశీ రోగులకు ఆకర్షణీయంగా మారుస్తున్నాయి.
() కేరళ
సంప్రదాయ వైద్య విధానాలతో పాటు ఆధునిక వైద్య సేవలు, వెల్‌నెస్ టూరిజం, ఆయుర్వేద చికిత్సలకు కేరళ ప్రసిద్ధి చెందుతోంది. ఆరోగ్య పర్యాటకం, పునరుజ్జీవన చికిత్సల కోసం విదేశీయులు కేరళను సందర్శిస్తున్నారు. అయితే ఆయుర్వేదం, సంప్రదాయ వైద్య సేవల్లో శాస్త్రీయ ఆధారాలు, ప్రామాణిక చికిత్సా విధానాలు, రోగుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.


