HomeTOURS & TRAVELSTravel: అంటార్కిటికా మంచు పొరల కింద భారీ పురాతన పర్వతాల గుర్తింపు!

Travel: అంటార్కిటికా మంచు పొరల కింద భారీ పురాతన పర్వతాల గుర్తింపు!

📰 Generate e-Paper Clip

అంటార్కిటికా.. ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రాంతం. ఈ ఖండంలో 99.5 శాతానికి పైగా విస్తీర్ణం మందపాటి మంచు పొరలతో కప్పబడి ఉంటుంది. అయితే ఈ మంచు పొరల కింద ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు అంటార్కిటికా మంచు పొరల కింద హిమాలయాలంత ఎత్తైన భారీ పురాతన పర్వతాలు ఉన్నట్లు గుర్తించారు. వందల మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ పర్వతాలు భూమిపై జీవుల పరిణామానికి కూడా దోహదపడి ఉండవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ, జర్మనీకి చెందిన GFZ జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. వీరి పరిశోధన వివరాలు ‘ఎర్త్ అండ్ ప్లానెటరీ సైన్స్ లెటర్స్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

పరిశోధకుల అంచనా ప్రకారం.. సుమారు 650 మిలియన్ల నుంచి 450 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ భారీ పర్వతాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో అంటార్కిటికా, భారత్, ఆఫ్రికా ఖండాలు పరస్పరం ఢీకొని గోండ్వానా అనే భారీ భూభాగంగా ఏర్పడ్డాయి. అంటార్కిటికా చరిత్రలోనే ఇవి అతిపెద్ద పర్వత నిర్మాణ ప్రక్రియలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన ఎమెరిటస్ ప్రొఫెసర్ ఇయాన్ క్యాంప్‌బెల్ మాట్లాడుతూ.. అంటార్కిటికాను ప్రభావితం చేసిన పర్వత నిర్మాణ ప్రక్రియల్లో ఇవే అత్యంత భారీమైనవని పేర్కొన్నారు. సుమారు 539 మిలియన్ల సంవత్సరాల క్రితం భూమిపై గట్టి పెంకులు కలిగిన తొలి జంతువులు ఆవిర్భవించిన సమయంలోనే ఈ పర్వత నిర్మాణ ప్రక్రియలు జరిగాయని ఆయన వివరించారు. ఆ తర్వాత భూమిపై జంతువుల సంఖ్య, వాటి జాతుల వైవిధ్యం గణనీయంగా పెరిగింది. ఈ పరిణామాన్ని శాస్త్రవేత్తలు ‘కాంబ్రియన్ ఎక్స్‌ప్లోషన్’గా పిలుస్తారు.

అంటార్కిటికాలో 99.5 శాతానికి పైగా ప్రాంతం మంచుతో కప్పబడి ఉండటంతో అక్కడి రాళ్లను నేరుగా పరిశీలించడం సాధ్యం కాదు. దీంతో పరిశోధకులు జిర్కాన్ అనే సూక్ష్మ ఖనిజ కణాలను అధ్యయనం చేశారు. అంటార్కిటికా తీర ప్రాంతానికి సమీపంలో సముద్రంలో డ్రిల్లింగ్ ద్వారా సేకరించిన అవక్షేపాల నుంచి మొత్తం 1,712 జిర్కాన్ ఖనిజ కణాలను సేకరించారు. ఈ చిన్న చిన్న స్ఫటికాల్లో అవి ఏర్పడిన రాళ్ల వయస్సు, రసాయన స్వభావానికి సంబంధించిన సమాచారం ఉంటుంది. వాటిని విశ్లేషించడం ద్వారా గతంలో అంటార్కిటికాలో ఉన్న రాళ్లు ఎప్పుడు ఏర్పడ్డాయో శాస్త్రవేత్తలు అంచనా వేయగలిగారు.

ఈ భారీ పర్వతాలు భూమిపై జంతుజీవుల ఆవిర్భావానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టించి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. వర్షాలు, గాలులు, ఇతర ప్రకృతి ప్రక్రియల కారణంగా ఈ పర్వతాలు క్రమంగా అరిగిపోవడాన్ని ఎరోషన్ అంటారు. ఈ ప్రక్రియ ద్వారా పెద్ద మొత్తంలో పోషక పదార్థాలు సముద్రాల్లోకి చేరి ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అదే సమయంలో వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ పరిమాణం తగ్గి, ఆక్సిజన్ స్థాయులు పెరిగేందుకు కూడా ఈ ప్రక్రియ దోహదపడి ఉండవచ్చు. నదుల ద్వారా కొంత కార్బన్ అవక్షేపాల రూపంలో నిల్వ చేయబడింది. ఈ మార్పులన్నీ తొలి జంతువులు మనుగడ సాగించడానికి, అభివృద్ధి చెందడానికి అనుకూల పరిస్థితులను కల్పించి ఉండవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ సందర్భంగా ఇయాన్ క్యాంప్‌బెల్ మాట్లాడుతూ.. సుమారు 539 మిలియన్ల సంవత్సరాల క్రితం తొలి పెంకు కలిగిన జీవులు కనిపించడం, ఆ తర్వాత 10 నుంచి 30 మిలియన్ల సంవత్సరాల వ్యవధిలో జంతుజీవుల సంఖ్య, వైవిధ్యం భారీగా పెరగడం.. గోండ్వానా పర్వతాల నిర్మాణం, క్రమంగా అరిగిపోవడంతో ముడిపడి ఉన్నాయని వివరించారు.

భూమిపై జీవుల పరిణామంలో అత్యంత కీలకమైన దశ, గోండ్వానా సూపర్ మౌంటైన్స్ ఏర్పడిన కాలంతో పాటు జరగడం కేవలం యాదృచ్ఛికం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES

Most Popular