HomeTELANGANAKTR: తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం..డీలిమిటేషన్‌కు కేటీఆర్ మద్దతు

KTR: తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం..డీలిమిటేషన్‌కు కేటీఆర్ మద్దతు

📰 Generate e-Paper Clip

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను పూర్తిగా కాపాడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ స్థానాల పునర్విభజనలో తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరిగినా సహించబోమని తేల్చిచెప్పారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో దక్షిణ భారత రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న 24 శాతం ప్రాతినిధ్యాన్ని యథాతథంగా కొనసాగించాలని బీఆర్ఎస్ మొదటి నుంచి డిమాండ్ చేస్తోందని తెలిపారు. లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచే క్రమంలో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గకుండా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తాజా విధానంలో పార్లమెంట్ స్థానాలను 50 శాతం పెంచడంతో పాటు, 2051 వరకు రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య నిష్పత్తిని మార్చకుండా రక్షణ కల్పించే ప్రతిపాదన ఉందని కేటీఆర్ వెల్లడించారు. ఈ ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలు లేవనెత్తిన ప్రధాన ఆందోళనలకు పరిష్కారం చూపుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తెలంగాణకు లోక్‌సభలో ఉన్న 17 స్థానాలు ఈ ప్రతిపాదన అమలైతే 26కు పెరుగుతాయని తెలిపారు. దీంతో దేశ అత్యున్నత చట్టసభలో తెలంగాణ గొంతుక మరింత బలంగా వినిపించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

డీలిమిటేషన్ ప్రతిపాదనపై పార్టీ నిర్ణయాన్ని వెల్లడిస్తూ.. బీఆర్ఎస్‌కు చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తారని కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, ప్రతిపాదనలో పొందుపరిచిన రక్షణ చర్యలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

మహిళా రిజర్వేషన్లకు బీఆర్ఎస్ ఎప్పుడూ మద్దతుగా ఉంటుందని కేటీఆర్ పునరుద్ఘాటించారు. మహిళలకు రాజకీయాల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని, మహిళా రిజర్వేషన్ల అమలుకు తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందన్న చర్చ నేపథ్యంలో కేటీఆర్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

RELATED ARTICLES

Most Popular