HomeENTERTAINMENTMammootty: ఏఐ వీడియోల ఎఫెక్ట్.. డ్యాన్స్ చేయాలన్న చిరకాల కోరికకు మమ్ముట్టి గుడ్‌బై!

Mammootty: ఏఐ వీడియోల ఎఫెక్ట్.. డ్యాన్స్ చేయాలన్న చిరకాల కోరికకు మమ్ముట్టి గుడ్‌బై!

📰 Generate e-Paper Clip

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తనకు ఉన్న ఓ చిరకాల కోరికను వదులుకున్నట్లు సరదాగా వెల్లడించారు. సినిమాల్లో కనీసం ఒక్కసారైనా డ్యాన్స్ చేయాలన్న ఆశ తనకు ఉండేదని, అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) డ్యాన్స్ వీడియోల కారణంగా ఆ ఆలోచనను విరమించుకున్నానని చెప్పారు. ఒకవేళ తాను నిజంగా సినిమాలో డ్యాన్స్ చేసినా.. ప్రేక్షకులు దానిని ఏఐ వీడియో అని అనుకుంటారేమోనని చమత్కరించారు.

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మమ్ముట్టి.. సినీ పరిశ్రమపై ఏఐ ప్రభావం గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తనకు సంబంధించిన డ్యాన్స్ రీల్స్ గురించి ప్రస్తావించారు. ఏఐ టూల్స్ తక్కువ ఖర్చుతోనే అందుబాటులోకి రావడంతో యువత వాటిని ఉపయోగించి రకరకాల వీడియోలు రూపొందిస్తున్నారని చెప్పారు. తన జీవితంలో ఎప్పుడూ ఊహించని విధంగా ఏఐ వీడియోల్లో తనతో డ్యాన్స్ చేయిస్తున్నారని వాటిని చూసి తానే ఆశ్చర్యపోతున్నానని తెలిపారు.

ఒక సినిమాలోనైనా డ్యాన్స్ చేయాలన్న కోరిక తనకు ఎప్పటి నుంచో ఉందని అయితే అది తనకు చాలా కష్టమైన విషయమని మమ్ముట్టి పేర్కొన్నారు. ఇప్పుడు ఎంతో కష్టపడి నిజంగా డ్యాన్స్ చేసినా.. ప్రేక్షకులు మాత్రం అది ఏఐ సృష్టించిన వీడియో అని భావిస్తారని సరదాగా వ్యాఖ్యానించారు. అందుకే సినిమాల్లో డ్యాన్స్ చేయాలన్న తన కోరికను వదులుకున్నట్లు వెల్లడించారు.

ఏఐ ప్రభావంపై మమ్ముట్టి కేవలం సరదా వ్యాఖ్యలకే పరిమితం కాలేదు. ఈ సాంకేతికతను తేలికగా తీసుకోకూడదని హెచ్చరించారు. ప్రస్తుతం అమెరికా, చైనా వంటి దేశాలు ఏఐ అభివృద్ధిలో ముందున్నాయని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీ సామర్థ్యం మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెంట్‌గా మార్చి చూస్తే పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారవచ్చని వ్యాఖ్యానించారు. ఈ సాంకేతికత సామ్రాజ్యవాదులు లేదా నియంతల చేతుల్లోకి వెళితే ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మనుషుల కదలికలను సైతం నియంత్రించే పరిస్థితులు రావచ్చని హెచ్చరించారు.

ప్రస్తుతం మనమంతా ఏఐ రూపంలో ఒక ముప్పును ఎదుర్కొంటున్నామని మమ్ముట్టి పేర్కొన్నారు. వినోదం కోసం ఉపయోగిస్తున్న ఈ సాంకేతికతను దుర్వినియోగం చేస్తే సమాజంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

RELATED ARTICLES

Most Popular