స్వర్గధామంలాంటి పర్యాటక ప్రాంతంలోనూ దోమల బెడద ఉంటే విహారయాత్రకు ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా సాయంత్రం వేళ బీచ్‌లలో, స్విమ్మింగ్ పూల్స్ దగ్గర లేదా ఆరుబయట భోజనం చేసే సమయంలో దోమలు పర్యాటకులను ఇబ్బంది పెడుతుంటాయి. అయితే కరేబియన్ దీవుల్లోని ఓ లగ్జరీ రిసార్ట్ మాత్రం ఈ సమస్యకు వినూత్న పరిష్కారం చూపించింది. రసాయన మందులు పిచికారీ చేయకుండానే దోమల సంఖ్యను దాదాపు పూర్తిగా తగ్గించి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది.
బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లోని వర్జిన్ గోర్డా ద్వీపం తూర్పు ప్రాంతంలో ఉన్న ఆయిల్ నట్ బే (Oil Nut Bay) రిసార్ట్ ఈ ఘనత సాధించింది. కరేబియన్ ప్రాంతంలో దాదాపు దోమల బెడద లేని తొలి రిసార్ట్‌గా ఇది గుర్తింపు పొందింది. సుమారు 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ విలాసవంతమైన రిసార్ట్‌కు పడవ లేదా హెలికాప్టర్ ద్వారా మాత్రమే చేరుకోవచ్చు. ఇక్కడ అందమైన విల్లాలు, బీచ్‌లు, రెస్టారెంట్లు, మెరీనా, స్విమ్మింగ్ పూల్స్, ప్రకృతి కేంద్రం, సముద్రంపై నిర్మించిన స్పా వంటి సౌకర్యాలు ఉన్నాయి.
దోమలను నియంత్రించేందుకు సాధారణంగా రసాయన మందులను పిచికారీ చేస్తుంటారు. అయితే వీటివల్ల దోమలతో పాటు పర్యావరణానికి మేలు చేసే ఇతర కీటకాలు కూడా ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది. ఈ సమస్యకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ నట్ బే రిసార్ట్ ప్రకృతి ఆధారిత పద్ధతిని ఎంచుకుంది.
బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్కు చెందిన పర్యావరణ సంస్థ గ్రీన్ వీఐ , కీటకాల నియంత్రణ సాంకేతికతపై పనిచేస్తున్న గూగుల్ ప్రాజెక్ట్ డీబగ్ సహకారంతో ‘బగ్అవుట్ ప్రోగ్రామ్’ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా రెండు రకాల దోమల జాతులను లక్ష్యంగా చేసుకుని నియంత్రణ చర్యలు చేపట్టారు.ఈ ప్రయోగం ద్వారా పగటిపూట కుట్టే ఒక రకం దోమల సంఖ్యను ఏకంగా 98 శాతం తగ్గించారు. రాత్రిపూట కుట్టే మరో రకం దోమల సంఖ్యను 96 శాతం వరకు నియంత్రించినట్లు రిసార్ట్ వెల్లడించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా వోల్బాచియా అనే సహజ బ్యాక్టీరియాను కలిగి ఉన్న మగ దోమలను రిసార్ట్ పరిసరాల్లో విడుదల చేస్తారు. వోల్బాచియా అనేది అనేక కీటకాలలో సహజంగా కనిపించే బ్యాక్టీరియా.ఈ మగ దోమలు అడవి ఆడ దోమలతో జతకట్టినప్పుడు వాటి గుడ్ల నుంచి పిల్ల దోమలు బయటకు రావు. దీంతో క్రమంగా దోమల సంతతి తగ్గిపోతుంది. ఈ విధానంలో జన్యుపరంగా మార్పులు చేసిన దోమలను ఉపయోగించడం లేదు. అంతేకాకుండా చుట్టుపక్కల పర్యావరణ వ్యవస్థలోని అన్ని కీటకాలపై ప్రభావం చూపకుండా నిర్దిష్ట దోమల జాతులనే లక్ష్యంగా చేసుకుంటారు.వర్జిన్ గోర్డా ద్వీపం అందమైన గ్రానైట్ రాళ్లు, సహజమైన నీటి మడుగులు, స్వచ్ఛమైన సముద్ర జలాలు, పచ్చని వృక్షసంపదతో ప్రసిద్ధి చెందింది.


