బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కరీంనగర్లో నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకాన్ని అంతం చేయండి నినాదంతో బీజేపీ చేపట్టిన దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఈ పాదయాత్ర నిర్వహించారు. కరీంనగర్లోని వైశ్య భవన్ సమీపంలో నిర్వహించిన బహిరంగ సభలో నితిన్ నబీన్ ప్రసంగించారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నితిన్ నబీన్.. దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. ప్రజలు, ఓట్లు తమ వైపే ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుంటోందని విమర్శించారు.
దేశంలో ఎలాంటి ఓట్ల చోరీ జరగలేదని స్పష్టం చేశారు. ప్రజలు బీజేపీకి మద్దతుగా ఉన్నారని, ఎన్నికల ఫలితాలు కూడా అదే విషయాన్ని వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు.ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ తప్పుగా ప్రచారం చేస్తోందని నితిన్ నబీన్ ఆరోపించారు. ఓటర్ల జాబితాలో ఉన్న మరణించిన వారి పేర్లు, డూప్లికేట్ ఓట్లు, అనర్హమైన నమోదులను తొలగించడం ఎన్నికల ప్రక్రియలో భాగమని వివరించారు.
దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల ఓట్లు తొలగించారంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. సుమారు 2.8 నుంచి 3 కోట్ల వరకు మరణించిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయని, మరో ఆరు కోట్ల మంది రెండు చోట్ల ఓటర్లుగా నమోదయ్యారని ఆయన పేర్కొన్నారు. చిరునామా వివరాలను ధ్రువీకరించుకోవాలని కోరినప్పటికీ సుమారు మూడు కోట్ల మంది స్పందించలేదని ఆరోపించారు.
ఎన్నికల్లో గెలిచినప్పుడు ఎన్నికల సంఘంపై ఎలాంటి ఆరోపణలు చేయని కాంగ్రెస్.. ఓడిపోయిన తర్వాత మాత్రం ఓట్ల చోరీ జరిగిందంటూ విమర్శలు చేస్తోందని నితిన్ నబీన్ అన్నారు. ఎన్నికల సంఘం, రాజ్యాంగ సంస్థలపై ప్రజల్లో అనుమానాలు కలిగించడం సరికాదని వ్యాఖ్యానించారు.ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఉండాలని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై అవగాహన కల్పించడమే తమ కార్యక్రమాల ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, ప్రజల మద్దతు బీజేపీకే ఉందని నితిన్ నబీన్ ధీమా వ్యక్తం చేశారు.


