దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. కాలుష్యానికి కారణమవుతున్న పాత వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టిన ఢిల్లీ పోలీసులు ఈ ఏడాది ఇప్పటివరకు 17 వేలకు పైగా వాహనాలను సీజ్ చేశారు. అంతేకాకుండా సరైన పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్లు లేని వాహనాలపై భారీగా జరిమానాలు విధించారు.
ఈ ఏడాది ఇప్పటివరకు 17 వేలకు పైగా కాలపరిమితి ముగిసిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 16,918 ద్విచక్ర వాహనాలు ఉండగా 164 కార్లు ఉన్నాయి. మిగిలినవి త్రిచక్ర వాహనాలు, ఇతర వాహనాలు. మరోవైపు, ఢిల్లీలోని సెంట్రల్, ఈస్టర్న్, నార్తర్న్ ట్రాఫిక్ పరిధులతో కూడిన జోన్-1లో ట్రాఫిక్ పోలీసులు ఈ ఏడాది 9,916 పాత వాహనాలను సీజ్ చేశారు.
కాలపరిమితి ముగిసిన వాహనాలను స్వచ్ఛందంగా అప్పగించి, ప్రభుత్వం గుర్తించిన అధికారిక స్క్రాపింగ్ కేంద్రాల్లోనే వాటిని తుక్కుగా మార్చాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నవంబర్ 12 నుంచి 16 వరకు 240 పాత వాహనాలను వాటి యజమానులు స్వచ్ఛందంగా అప్పగించడంతో అధికారులు స్వాధీనం చేసుకుని స్క్రాపింగ్కు పంపించారు. వీటిలో 10 ఏళ్లకు పైబడిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లకు పైబడిన పెట్రోల్ వాహనాలు ఉన్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమంలో దాదాపు 5 వేల మంది పాల్గొన్నారు.
మరోవైపు సరైన పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనాలపై కూడా పోలీసులు చర్యలు తీసుకున్నారు. నవంబర్ 1 నుంచి 17 వరకు మొత్తం 25,610 చలాన్లు జారీ చేశారు. ఇదే సమయంలో ఢిల్లీ సరిహద్దుల వద్ద BS-VI ప్రమాణాలకు అనుగుణంగా లేని 30,742 వాహనాలను వెనక్కి పంపించారు. మరో 2,817 వాహనాలకు జరిమానాలు విధించారు. వీటి ద్వారా మొత్తం రూ.5.42 కోట్ల జరిమానాలు విధించినట్లు అధికారులు వెల్లడించారు.


