HomeNATIONALBilkis Bano Case: 17 ఏళ్ల తర్వాత ఇద్దరు దోషులకు బెయిల్..సుప్రీం సంచలనం!

Bilkis Bano Case: 17 ఏళ్ల తర్వాత ఇద్దరు దోషులకు బెయిల్..సుప్రీం సంచలనం!

📰 Generate e-Paper Clip

2002 గుజరాత్ అల్లర్ల సమయంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే 17 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. వారి జీవిత ఖైదు శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అక్టోబర్ 28న ఈ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలు నవంబర్ 16న వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో దోషులుగా తేలిన బిపిన్ చంద్ర జోషి, ప్రదీప్ మోర్ధియా దాఖలు చేసిన అప్పీళ్లను విచారించిన ధర్మాసనం వారికి బెయిల్ మంజూరు చేసింది.

ఇద్దరూ ఇప్పటికే 17 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపారని వారిలో ఒకరు తీవ్ర వైకల్యంతో బాధపడుతున్నారని కోర్టు గుర్తించింది. అంతేకాకుండా వారి అప్పీళ్లలో వాస్తవాలు, చట్టపరమైన అంశాలపై ఇంకా విచారణ జరగాల్సి ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో సంబంధిత ట్రయల్ కోర్టు విధించే నిబంధనలు, షరతులకు లోబడి బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది.

ఇద్దరు దోషుల తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. తన క్లయింట్లు ఇప్పటికే 17 ఏళ్లకు పైగా జైలులో ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వారిలో ఒకరి పేరు తొలుత ఎఫ్‌ఐఆర్‌లో లేదని ఘటన జరిగిన దాదాపు మూడేళ్ల తర్వాత కేసులో చేర్చారని వాదించారు. మరోవైపు ఒక దోషి తీవ్ర శారీరక వైకల్యంతో ఉన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు.

2002 ఫిబ్రవరిలో గుజరాత్‌లో గోద్రా రైలు దహనం ఘటన అనంతరం పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఆ సమయంలో 21 ఏళ్ల వయసున్న బిల్కిస్ బానో ఐదు నెలల గర్భిణి. అల్లర్ల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి పారిపోతున్న ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ దాడిలో ఆమె మూడేళ్ల కుమార్తెతో పాటు కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో మొత్తం 11 మందిని దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించారు. అయితే 2022 ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం వీరందరికీ శిక్షా ఉపశమనం కల్పించడంతో వారు జైలు నుంచి విడుదలయ్యారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

 

RELATED ARTICLES

Most Popular