వర్ధన్నపేట: విధి నిర్వహణలోనే కాకుండా ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ వర్ధన్నపేట ఎస్సై బి. ప్రవీణ్ మానవత్వాన్ని చాటుకున్నారు. తండ్రిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఇద్దరు చిన్నారుల భవిష్యత్తుకు తన వంతు సహాయం అందించారు. బాధిత కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఆయన రూ.20 వేల ఆర్థిక సాయం చేసి ఉదారతను చాటుకున్నారు.
వర్ధన్నపేట పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఒంగూరి శ్రీకాంత్ ఇటీవల కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ముఖ్యంగా తండ్రిని కోల్పోయిన ఇద్దరు చిన్నారుల పరిస్థితిని చూసి చలించిన ఎస్సై ప్రవీణ్ వారికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో తన భార్య కస్తూరి పేరు మీద రూ.20,000లను పోస్టాఫీస్‌లో స్థిర డిపాజిట్ చేశారు. చిన్నారుల భవిష్యత్తుకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ మొత్తాన్ని వారి కోసం జమ చేశారు.
పోలీసు అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే సమాజంలో ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం ద్వారా ఎస్సై ప్రవీణ్ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. తండ్రిని కోల్పోయిన చిన్నారులకు ఆర్థిక భరోసా కల్పించిన ఆయన సేవా దృక్పథంపై స్థానికులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.


