నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌లు మన దైనందిన జీవితంలో భాగమైపోయాయి. బ్యాంకింగ్, షాపింగ్, జ్యోతిష్యం, నిత్యావసరాల ఆర్డర్ల వరకు ప్రతిదానికీ మనం మొబైల్ యాప్‌లపై ఆధారపడుతున్నాం అయితే మనం ఫోన్‌ను వాడుతున్నామా లేక ఫోన్ యాప్‌లే మన డేటాను వాడుకుంటున్నాయా అనే ప్రశ్న ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన పరిణామాలు యూజర్ల వ్యక్తిగత గోప్యతపై ఆందోళన కలిగిస్తున్నాయి.
రివర్స్ ఇంజనీరింగ్ విశ్లేషణలో ఆస్ట్రోటాక్ యాప్‌లో 244 యాప్‌ల జాబితా బయటపడటం అలాగే బ్లింకిట్ వంటి ప్లాట్‌ఫామ్‌లపై కూడా ఇలాంటి ఆరోపణలు రావడంతో యాప్‌ల డేటా సేకరణపై కలకలం రేగింది. కేవలం మనం ఉపయోగించే యాప్‌ల సమాచారమే కాకుండా మన ఫోన్‌లోని ఇతర యాప్‌ల వివరాలు, లొకేషన్ డేటా, మన అలవాట్ల ఆధారంగా యూజర్ల సమగ్ర డిజిటల్ ప్రొఫైల్‌ను రూపొందించే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి డేటా సేకరణ వల్ల వినియోగదారుల ప్రైవసీకి భంగం కలిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
మనం డౌన్‌లోడ్ చేసుకునే అనేక యాప్‌లు ఇన్‌స్టాల్ చేసే సమయంలో లేదా ఉపయోగిస్తున్నప్పుడు వివిధ రకాల అనుమతులను కోరుతుంటాయి. అవసరం లేకపోయినా లొకేషన్, ఫోన్‌లోని ఇతర సమాచారం వంటి వాటిని యాక్సెస్ చేయడం వల్ల యూజర్ల కదలికలు, ఆసక్తులు సులభంగా విశ్లేషించబడే అవకాశం ఉంటుంది. అందుకే యాప్ అనుమతుల విషయంలో యూజర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతి యాప్‌కు లొకేషన్, ఇతర డేటా యాక్సెస్ అవసరమా లేదా అని పరిశీలించి, అనవసరమైన అనుమతులను నిలిపివేయాలి. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్‌ల ప్రైవసీ, డేటా షేరింగ్ విధానాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. కొత్త యాప్‌లను ఇన్‌స్టాల్ చేసే ముందు వాటి డేటా భద్రత, నిబంధనలపై కనీస అవగాహన కలిగి ఉండాలి.
మన అలవాట్లు, ఆన్‌లైన్ కార్యకలాపాలు డిజిటల్ ప్రొఫైల్‌గా మారకుండా జాగ్రత్త పడుతూ స్మార్ట్‌ఫోన్‌ను సురక్షితంగా ఉపయోగించాలి. మొత్తంగా సాంకేతికత అందించే సౌకర్యాలను పొందుతూనే మన వ్యక్తిగత డేటాను కాపాడుకోవడం ప్రస్తుత కాలంలో అత్యంత కీలకం. యాప్‌ల డేటా వేటపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రతి యూజర్ బాధ్యతాయుతంగా అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా తమ డిజిటల్ ప్రైవసీని రక్షించుకోవచ్చు.


