ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగిన నేపథ్యంలో వాట్సాప్ మన రోజువారీ జీవితంలో కీలకంగా మారింది. ముఖ్యంగా కంప్యూటర్లో పనిచేసే వారు వాట్సాప్ వెబ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల కంప్యూటర్ నుంచే మెసేజ్‌లు పంపడం, ఫొటోలు, వీడియోలు షేర్ చేయడం సులభంగా మారింది. అయితే వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని సైబర్ భద్రతా విభాగం హెచ్చరిస్తోంది.
ఇటీవల ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) పరిధిలోని నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (NCTAU) ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. వాట్సాప్ వెబ్‌లో లాగిన్ అయిన తర్వాత అకౌంట్‌ను అలాగే వదిలేస్తే ఇతరులు దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సూచించింది.
అకౌంట్ హ్యాక్ అయితే ఏం జరుగుతుంది?
మీ వాట్సాప్ వెబ్ సెషన్‌ను ఇతరులు అనధికారికంగా యాక్సెస్ చేస్తే మీ వ్యక్తిగత చాట్స్ చదివే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ పేరుతో ఇతరులకు మెసేజ్‌లు పంపవచ్చు. మీ కాంటాక్ట్స్, గ్రూప్ సంభాషణలను కూడా పరిశీలించవచ్చు. వీటిని ఉపయోగించి ఆర్థిక మోసాలు, ఫిషింగ్ లింకులు పంపడం, తప్పుడు సమాచారంతో ఇతరులను మోసం చేయడం వంటి సైబర్ నేరాలకు పాల్పడే ప్రమాదం ఉంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
1. ప్రతిసారీ లాగ్ అవుట్ చేయండి: వాట్సాప్ వెబ్‌లో పని పూర్తయిన వెంటనే తప్పనిసరిగా లాగ్ అవుట్ కావాలి. బ్రౌజర్ విండో లేదా ట్యాబ్‌ను క్లోజ్ చేసినంత మాత్రాన అకౌంట్ లాగ్ అవుట్ అయినట్లు కాదు.
2. పబ్లిక్ కంప్యూటర్లలో వాడొద్దు: సైబర్ కేఫ్‌లు, హోటళ్లలోని కంప్యూటర్లు, పబ్లిక్ కియోస్క్‌లు, ఇతరుల కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ లాగిన్ చేయకపోవడమే మంచిది.
3. ఇంకాగ్నిటో మోడ్ ఉపయోగించండి: తాత్కాలికంగా వాట్సాప్ వెబ్ ఉపయోగించాల్సి వస్తే నమ్మకమైన కంప్యూటర్లో Incognito లేదా Private Browsing మోడ్‌ను ఉపయోగించవచ్చు. అయితే పని పూర్తయిన తర్వాత తప్పనిసరిగా మాన్యువల్‌గా లాగ్ అవుట్ కావాలి.
4. సున్నితమైన సమాచారం షేర్ చేయొద్దు: ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం, సంస్థల రహస్య వివరాలు, బ్యాంకింగ్ సమాచారం, ఆర్థిక లావాదేవీల వివరాలు వంటి కీలక సమాచారాన్ని వాట్సాప్ వెబ్ ద్వారా పంపించకూడదు.
5. అనుమానాస్పద కార్యకలాపాలను గమనించండి: మీరు పంపని మెసేజ్‌లు ఇతరులకు వెళ్లడం, మీ కాంటాక్ట్స్ నుంచి అనుమానాస్పద సమాధానాలు రావడం వంటి పరిణామాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి.
6. సాఫ్ట్వేర్ అప్డేట్ చేయండి: కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, బ్రౌజర్, సెక్యూరిటీ సాఫ్ట్వేర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. అనుమానాస్పద ఫైల్స్, తెలియని డౌన్లోడ్స్, క్రాక్డ్ సాఫ్ట్వేర్లకు దూరంగా ఉండాలి.
ప్రభుత్వ, సంస్థల కార్యాలయాల్లోని కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ వినియోగాన్ని తగ్గించాలని సైబర్ భద్రతా విభాగం సూచిస్తోంది. ముఖ్యంగా రహస్య సమాచారం ఉండే కార్యాలయాల్లో వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించకపోవడమే మంచిదని పేర్కొంది. ఇంకాగ్నిటో మోడ్ ఉపయోగించడం అదనపు జాగ్రత్త మాత్రమేనని అది లాగ్ అవుట్‌కు ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేసింది. వాట్సాప్ వెబ్ ఉపయోగించడం సులభమే కానీ భద్రత విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు.


