HomePOLITICALTelangana BJP: టార్గెట్ రామరాజ్యం.. తెలంగాణపై అమిత్ షా స్పెషల్ ఫోకస్, పవర్‌లోకి వచ్చేనా?

Telangana BJP: టార్గెట్ రామరాజ్యం.. తెలంగాణపై అమిత్ షా స్పెషల్ ఫోకస్, పవర్‌లోకి వచ్చేనా?

📰 Generate e-Paper Clip

2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలను దీటుగా ఎదుర్కొని రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి బీజేపీ అగ్రనాయకత్వం (మోదీ-అమిత్ షా ద్వయం) వ్యూహాలను రచిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మరియు ఇతర హామీల అమలులో జాప్యంపై ప్రజల్లోకి వెళ్లి పోరాటాలు నిర్వహించాలని బీజేపీ నేతలు శ్రేణులకు పిలుపునిచ్చారు అమిత్ షా.

2028 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరగనున్న స్థానిక సంస్థల (ప్రాదేశిక) ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా కాంగ్రెస్ కంచుకోటలను ఛేదించి, ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణకు అందిస్తున్న నిధులు, అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది.

రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అసలైన ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకోవడం ద్వారా బీఆర్ఎస్ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకోవాలని బీజేపీ చూస్తోంది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలోని అవినీతి ఆరోపణలు, కుటుంబ రాజకీయాలను ప్రజలకు గుర్తుచేస్తూ ఆ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే భావనను ఓటర్లలో కల్పించే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో రేవంత్ పాలన వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించింది.

బీఆర్ఎస్‌కు బలంగా ఉన్న నియోజకవర్గాలు, సామాజిక వర్గాలపై (ముఖ్యంగా బీసీ, ఎస్సీ వర్గాలైన ముదిరాజ్, మున్నూరు కాపు, మాదిగ – 3M సమీకరణం) దృష్టి సారించి ఆయా వర్గాల నేతలను పార్టీలోకి ఆకర్షించడం ద్వారా బీఆర్ఎస్‌ను క్షేత్రస్థాయిలో బలహీనపరచాలని ప్రణాళికలు రచిస్తోంది.

ఇక ఏపీలో టీడీపీ, జనసేనతో అధికారాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ తెలంగాణలో మాత్రం ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. రాజకీయాలకు అతీతంగా ఉండే తటస్థ ఓటర్లు, వ్యాపార, సినీ రంగాల ప్రముఖుల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ వ్యూహకర్తల బృందాలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరిస్తున్నాయి.

ఇదే క్రమంలో బీజేపీ అగ్రనేతలు తెలంగాణలోవిడుతల వారిగా పర్యటించేలా రూట్ మ్యాప్ రెడీ చేశారు. ఇప్పటికే అమిత్ షా.. హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ సందర్శన, ‘లోక్‌తంత్ర బచావో మహా పాదయాత్ర ద్వారా స్వయంగా రంగంలోకి దిగి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. బీజేపీ చీఫ్ నితిన్ నబీన్.. కరీంనగర్‌ మహా పాదయాత్రలో పాల్గొని కేడర్‌లో జోష్ నింపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి ఆరోపణలను ఎండగడుతూనే బీఆర్ఎస్ మరియు ఎంఐఎం పార్టీలను ఒకే గాటన కట్టి ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గిరిజన అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది బీజేపీ.

అయితే ఇంతవరకు బాగానే ఉన్నా బీజేపీకి గత అనుభవం మాత్రం చేధుగానే మిగిలిపోయింది. టీబీజేపీ చీఫ్‌గా బండి సంజయ్‌ ఉన్న సమయంలో కేడర్‌లో ఫుల్ జోష్ ఉండగా ప్రజల్లో కూడా ఆ పార్టీ పట్ల కాస్త సానుకూల వాతావరణం ఉంది. కానీ సడన్‌గా బండిని పార్టీ అధ్యక్ష పదవి నుండి తొలగించడంతో ఆ స్థానాన్ని కాంగ్రెస్ భర్తీ చేసి అధికారాన్ని కైవసం చేసుకుంది. తాజాగా బీజేపీ రచిస్తున్న ఎన్నికల వ్యూహాలు ఆ పార్టీకి మేలు చేస్తాయా లేదా అధికారాన్ని దక్కించుకోవడంలో సాయ పడతాయా అన్నది వేచిచూడాల్సిందే.

RELATED ARTICLES

Most Popular