HomeTECHNOLOGYSamsung Galaxy SmartTag3: అదిరే ఫీచర్..ఇకపై మీ వస్తువులు ఎక్కడున్నా ఇట్టే గుర్తించొచ్చు!

Samsung Galaxy SmartTag3: అదిరే ఫీచర్..ఇకపై మీ వస్తువులు ఎక్కడున్నా ఇట్టే గుర్తించొచ్చు!

📰 Generate e-Paper Clip

వస్తువులు ఎక్కడ పెట్టామో మర్చిపోతున్నారా? ఇంట్లోనో, బయటో కీలకమైన వస్తువులు కనిపించకుండా పోతున్నాయా? ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా శాంసంగ్ సరికొత్త ట్రాకింగ్ పరికరం Galaxy SmartTag3ను పరిచయం చేసింది. స్మార్ట్ థింగ్స్ యాప్‌తో అనుసంధానమయ్యే ఈ పరికరం ద్వారా బ్యాగులు, సూట్‌కేసులు, సైకిళ్లు, పెంపుడు జంతువులు వంటి వాటి ఆచూకీని మరింత కచ్చితంగా తెలుసుకోవచ్చు. మెరుగైన లొకేషన్ టెక్నాలజీ, స్మార్ట్ హోమ్ ఫీచర్లతో ఇది వినియోగదారులకు ఉపయోగపడనుంది.

గెలాక్సీ స్మార్ట్ ట్యాగ్3లో అందించిన ప్రధాన ఫీచర్ Compass View. Bluetooth 6.0 Channel Sounding టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ ఫీచర్ ద్వారా సుమారు 60 మీటర్ల దూరం నుంచే ట్యాగ్ ఎక్కడ ఉందో, ఏ దిశలో ఉందో తెలుసుకోవచ్చు. గత మోడల్‌తో పోలిస్తే గుర్తించే పరిధి దాదాపు మూడు రెట్లు పెరిగినట్లు శాంసంగ్ వెల్లడించింది.

సాధారణ బ్లూటూత్ టెక్నాలజీ సిగ్నల్ బలాన్ని ఆధారంగా చేసుకుని దూరాన్ని అంచనా వేస్తుంది. రేడియో తరంగాల ప్రయాణ సమయం, దశలో వచ్చే మార్పులను విశ్లేషించి మరింత కచ్చితమైన దూరాన్ని లెక్కిస్తుంది. దీనికి అల్ట్రా వైడ్‌బ్యాండ్ (UWB) టెక్నాలజీ కూడా తోడవుతుంది. స్మార్ట్‌ఫోన్ ట్యాగ్‌కు 20 మీటర్ల పరిధిలో ఉన్నప్పుడు మరింత కచ్చితమైన గుర్తింపు సాధ్యమవుతుంది.

స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ పరిధి దాటి ట్యాగ్ వెళ్లిపోయినా దాని ఆచూకీ తెలుసుకునే అవకాశం ఉంది. SmartThingsలోని లోకేషన్ హిస్టరీ ఫీచర్ ద్వారా గత ఏడు రోజుల పాటు ట్యాగ్ గుర్తించిన ప్రాంతాలను మ్యాప్‌లో క్రమానుగతంగా చూడవచ్చు. ఏడు రోజుల తర్వాత పాత లొకేషన్ వివరాలు ఆటోమేటిక్‌గా తొలగిపోతాయి.

ఈ ఫీచర్ కోసం Galaxy Find Network పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 90 కోట్లకు పైగా భాగస్వామ్య గెలాక్సీ పరికరాలు ఈ నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్నాయని శాంసంగ్ తెలిపింది. సమీపంలోని గెలాక్సీ పరికరాలు ట్యాగ్ నుంచి వెలువడే బ్లూటూత్ సిగ్నళ్లను గుర్తించి SmartThings సర్వర్లకు సమాచారాన్ని చేరవేస్తాయి.

వినియోగదారుల గోప్యతకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు కంపెనీ పేర్కొంది. లొకేషన్ సమాచారం ప్రత్యేక ప్రైవేట్ కీతో ఎన్‌క్రిప్ట్ అవుతుంది. ట్యాగ్ యజమాని మాత్రమే దాని లొకేషన్‌ను చూడగలరు. ఇతర పరికరాలు, శాంసంగ్ సర్వర్లు కూడా ఈ సమాచారాన్ని నేరుగా వీక్షించలేవని సంస్థ వెల్లడించింది.

ఈ ట్రాకర్‌ను స్మార్ట్ హోమ్ పరికరాలతోనూ ఉపయోగించుకోవచ్చు. SmartThings అప్‌డేట్‌తో Smart Home Hubs, హబ్ సదుపాయం ఉన్న Samsung Smart TVs ద్వారా ట్యాగ్ ఉన్న వస్తువు ఇంట్లోకి వచ్చినా, బయటకు వెళ్లినా అలర్ట్స్ పొందవచ్చు. అంతేకాదు SmartTag3లోని బటన్‌ను ఒక్కసారి నొక్కడం లేదా ఎక్కువసేపు నొక్కి ఉంచడం ద్వారా స్మార్ట్ హోమ్ రొటీన్లను ప్రారంభించవచ్చు. ఉదాహరణకు సినిమా చూసే సమయంలో ఒకే బటన్‌తో అనుసంధానమైన పరికరాలను నియంత్రించే అవకాశం ఉంటుంది.

కుటుంబ సభ్యులు, స్నేహితులతోనూ ట్యాగ్ లొకేషన్‌ను షేర్ చేసుకోవచ్చు. SmartThings లొకేషన్‌లో నమోదైన గరిష్ఠంగా 19 మంది సభ్యులతో లొకేషన్‌ను పంచుకునే అవకాశం ఉంది. లింక్ ద్వారా కూడా ఐదుగురు శాంసంగ్ ఖాతాదారులతో 12 గంటలు, 24 గంటలు లేదా ఏడు రోజుల పాటు లొకేషన్‌ను షేర్ చేయవచ్చు.

RELATED ARTICLES

Most Popular