ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా భారత మార్కెట్లో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు మోడళ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న మోటరోలా.. త్వరలో Motorola Edge 70 Neo 5G స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన లాంచ్ టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ ఫోన్ డిజైన్‌కు సంబంధించిన వివరాలు ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్లో వెల్లడయ్యాయి. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌పై టెక్ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది.
మోటరోలా ఇండియా అధికారికంగా కొత్త స్మార్ట్‌ఫోన్ రాకను టీజ్ చేసింది. ఫ్లిప్కార్ట్లోనూ ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేక పేజీ అందుబాటులోకి వచ్చింది. అందులో Your feed is about to enter a NEO era అనే ట్యాగ్‌లైన్ కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇది మోటరోలా ఎడ్జ్ 70 నియో ఫోన్ అని స్పష్టమవుతోంది.
ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ URLలో నవంబర్ 26 తేదీ కనిపిస్తుండటంతో అదే రోజున ఈ ఫోన్ లాంచ్ కావచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే కంపెనీ ఇంకా అధికారికంగా లాంచ్ తేదీని ప్రకటించలేదు. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయానికి వచ్చే అవకాశం ఉంది.
ఈ ఫోన్ ఫీచర్స్‌ని పరిశీలిస్తే..ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LYTIA సెన్సార్‌తో రానుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), అల్ట్రా HDR సపోర్ట్ ఉండనున్నాయి. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం హోల్ పంచ్ కెమెరా డిజైన్‌ను అందించనున్నారు.
– డిస్ప్లే: 6.78 అంగుళాల 1.5K OLED డిస్ప్లే
– రిఫ్రెష్ రేట్: 144Hz
– ప్రొటెక్షన్: కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i
– ప్రాసెసర్: క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3
– ర్యామ్: 6GB, 8GB
– స్టోరేజ్: 128GB, 256GB
– మెయిన్ కెమెరా: 50MP సోనీ LYTIA సెన్సార్
– మాక్రో కెమెరా: 2MP
– సెల్ఫీ కెమెరా: 32MP
– బ్యాటరీ: 7,000mAh
– ఫాస్ట్ ఛార్జింగ్: 45W
– ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 16
– వాటర్ రెసిస్టెన్స్: IP64 రేటింగ్
ఈ ఫోన్లో 7,000mAh భారీ బ్యాటరీని అందించనున్నట్లు సమాచారం. దీనికి 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుంది. అలాగే నాలుగు సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్, ఐదేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ అందించే అవకాశం ఉంది. అయితే ఈ ఫీచర్లన్నీ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
అయితే ఈ ఫోన్ ధరపై ఎలాంటి స్పష్టత రాకపోయినా టెక్ నిపుణుల ప్రకారం భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.30,000 నుంచి రూ.35,000 మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా.


