ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. నవంబర్ టెక్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా Xiaomi 18 Pro, Xiaomi 18 Pro Max మోడళ్లను తీసుకొచ్చింది. ఈ రెండు ఫోన్లలోనూ ప్రత్యేకమైన ప్రైవసీ డిస్‌ప్లే, వెనుకవైపు సెకండరీ AMOLED స్క్రీన్, 200 మెగాపిక్సెల్ కెమెరాలు వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్లు ప్రస్తుతం ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లలో కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
ఈ రెండు ఫ్లాగ్‌షిప్ ఫోన్లు నాలుగు రంగుల్లో లభిస్తున్నాయి. బ్లాక్, కాస్మిక్ బ్లూ, వెల్వెట్ రెడ్, వైట్ కలర్ ఆప్షన్లలో వీటిని కొనుగోలు చేయవచ్చు.
Xiaomi 18 Pro ప్రారంభ ధర 1,399 యూరోలు (భారత కరెన్సీలో సుమారు రూ.1,44,000). 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌కు ఈ ధర నిర్ణయించారు. 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ మోడల్ ధర 1,599 యూరోలు (సుమారు రూ.1,64,000).
మరోవైపు Xiaomi 18 Pro Max 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 1,599 యూరోలు (సుమారు రూ.1,64,000)గా ఉంది. 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ మోడల్ ధర 1,799 యూరోలు (సుమారు రూ.1,85,000). ఇక టాప్ వేరియంట్ 16GB ర్యామ్, 1TB స్టోరేజ్ మోడల్ ధర 2,099 యూరోలు (సుమారు రూ.2,16,000)గా నిర్ణయించారు.
డిస్‌ప్లే వివరాలు:
Xiaomi 18 Pro Maxలో 6.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (1,208 × 2,624 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లే ఇచ్చారు. Xiaomi 18 Proలో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (1,120 × 2,436 పిక్సెల్స్) AMOLED స్క్రీన్ అందించారు.
ఈ రెండు ఫోన్లలోనూ 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, గరిష్ఠంగా 4,000 నిట్స్ బ్రైట్‌నెస్, DCI-P3 వైడ్ కలర్ గామట్ సపోర్ట్ ఉన్నాయి.
వీటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఫీచర్ ప్రైవసీ డిస్‌ప్లే. పక్కన ఉన్నవారు స్క్రీన్‌ను చూడకుండా వీక్షణ కోణాన్ని పరిమితం చేసే విధంగా ఈ ఫీచర్ పనిచేస్తుంది. దీనివల్ల పబ్లిక్ ప్రదేశాల్లో ఫోన్ ఉపయోగించేటప్పుడు వ్యక్తిగత సమాచారం ఇతరులకు కనిపించకుండా కొంతవరకు రక్షణ లభిస్తుంది.
ఈ ఫోన్లలో మరో ప్రత్యేకత వెనుకవైపు అందించిన సెకండరీ AMOLED డిస్‌ప్లే. Xiaomi 18 Proలో 2.7 అంగుళాల (596 × 912 పిక్సెల్స్) స్క్రీన్ ఉండగా, Xiaomi 18 Pro Maxలో 2.9 అంగుళాల (596 × 976 పిక్సెల్స్) డిస్‌ప్లే ఇచ్చారు. ఈ రెండు స్క్రీన్లు కూడా 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తాయి.
బ్యాటరీ విషయంలో Xiaomi 18 Pro Maxలో 7,050mAh సామర్థ్యంతో కూడిన బ్యాటరీని ఇచ్చారు. Xiaomi 18 Proలో 6,000mAh బ్యాటరీని అమర్చారు.ఈ రెండు ఫోన్లు 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. అలాగే 27W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లను అందించారు.


