HomeNATIONALIndian Visas: విదేశీయులకు గుడ్‌న్యూస్.. భారత్ వీసా నిబంధనలు సులభతరం!

Indian Visas: విదేశీయులకు గుడ్‌న్యూస్.. భారత్ వీసా నిబంధనలు సులభతరం!

📰 Generate e-Paper Clip

భారత్‌కు వచ్చే విదేశీయులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వీసా దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ కీలక మార్పులు చేపట్టింది. ఇప్పటివరకు ఉన్న 13 ప్రధాన వీసా కేటగిరీలను 9కి తగ్గించింది. అలాగే 49 ఉప కేటగిరీలను 23కి కుదించింది. అంతేకాకుండా వీసా దరఖాస్తు ఫారాల్లో అవసరమైన వివరాలను 65 నుంచి 70 శాతం వరకు తగ్గించింది. విదేశీ పర్యాటకులు, విద్యార్థులు, వైద్య చికిత్స కోసం వచ్చే వారు వ్యాపారవేత్తలకు ఈ మార్పులు ఎంతో ప్రయోజనకరంగా ఉండనున్నాయి.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు వీసా విధానంలో మార్పులు తీసుకొచ్చింది. విదేశీయులకు వీసా ప్రక్రియను సులభతరం చేయడం, వివిధ వీసా కేటగిరీల మధ్య ఉన్న గందరగోళాన్ని తొలగించడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. గతేడాది అక్టోబర్‌లో వీసా కేటగిరీలను 22 నుంచి 13కి, ఉప కేటగిరీలను 63 నుంచి 49కి తగ్గించారు. తాజాగా ఆగస్టు 27, 2026న మరోసారి మార్పులు చేస్తూ ప్రధాన కేటగిరీలను 9కి, ఉప కేటగిరీలను 23కి కుదించారు.

ప్రస్తుతం 172 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సదుపాయాన్ని అందిస్తోంది. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ విధానం ద్వారా 13 ఉప కేటగిరీల్లో ఈ-వీసాలను జారీ చేస్తున్నారు. కొత్త మార్పులతో విదేశీయులు తమ ప్రయాణ ఉద్దేశానికి తగిన వీసాను సులభంగా ఎంచుకునే అవకాశం కలుగుతుంది. వీసా దరఖాస్తు ప్రక్రియలో అవసరమైన సమాచారాన్ని తగ్గించడం వల్ల సమయం, శ్రమ ఆదా అవుతాయని కేంద్రం భావిస్తోంది.

టూరిస్ట్ వీసా పేరు మార్పు.. కొత్తగా విజిటర్ వీసా

గతంలో టూరిస్ట్ వీసాగా పిలిచే కేటగిరీని ఇప్పుడు విజిటర్ వీసాగా మార్చారు. కేవలం పర్యాటకానికే కాకుండా ఇతర స్వల్పకాలిక అవసరాలకు కూడా ఈ వీసా ఉపయోగపడుతుంది. దీనిని రెండు ఉప కేటగిరీలుగా విభజించారు.

V-1 వీసా: వ్యాపార సమావేశాలు, వైద్య సంప్రదింపులు, వెల్‌నెస్ రిట్రీట్స్, స్వల్పకాలిక కోర్సులు వంటి అవసరాలకు ఈ వీసా ఇస్తారు. 30 రోజుల కాలపరిమితితో మల్టిపుల్ ఎంట్రీ సౌకర్యం ఉంటుంది.

V-2 వీసా: దీర్ఘకాలిక పర్యటనల కోసం ఈ వీసాను అందిస్తారు. అవసరాన్ని బట్టి ఒక సంవత్సరం, ఐదేళ్లు లేదా పదేళ్ల కాలపరిమితితో జారీ చేస్తారు.

వైద్య వీసాల్లోనూ కీలక మార్పులు

వైద్య చికిత్స కోసం భారత్‌కు వచ్చే విదేశీయులకు కూడా కొత్త నిబంధనలు ప్రయోజనకరంగా ఉండనున్నాయి. సంప్రదాయ వైద్య విధానాలు, ఆయుష్ చికిత్సలకు వేర్వేరు వీసా కేటగిరీలను ఏర్పాటు చేశారు.

M-1 వీసా: ఆయుష్ విధానాలు కాకుండా ఇతర సంప్రదాయ వైద్య చికిత్సల కోసం.

M-3 వీసా: ఆయుష్ వైద్య విధానాల ద్వారా చికిత్స పొందేందుకు.

ఈ రెండు కేటగిరీలకు సంబంధించిన వీసాలను సాధారణంగా ఒక సంవత్సరం కాలపరిమితితో మల్టిపుల్ ఎంట్రీ సౌకర్యంతో జారీ చేయనున్నారు. దీంతో చికిత్స కోసం పలుమార్లు భారత్‌కు రావాల్సిన రోగులకు సౌలభ్యం కలుగుతుంది. వైద్యులతో ఫాలోఅప్, తదుపరి చికిత్సల కోసం ప్రతిసారీ కొత్త వీసా తీసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది.

విద్యార్థులు, పరిశోధకులకు ప్రత్యేక వీసాలు

విద్య కోసం భారత్‌కు వచ్చే విదేశీయుల వీసా విధానంలోనూ మార్పులు చేశారు. స్టూడెంట్ వీసాను రెండు ఉప కేటగిరీలుగా విభజించారు.

S-1 వీసా: పాఠశాల, కళాశాల, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్య కోసం.

S-2 వీసా: పీహెచ్‌డీ, పరిశోధకులు, విజిటింగ్ ఫ్యాకల్టీ, పరిశోధన విద్యార్థులు, ఇంటర్న్‌షిప్‌లు, ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ల కోసం.

ఇండియాలోని విద్యాసంస్థల్లో చదువుకునే విదేశీ విద్యార్థులకు కోర్సు వ్యవధిని బట్టి ఐదేళ్ల వరకు ఈ-స్టూడెంట్ వీసా ఇచ్చే అవకాశం ఉంది. దీనివల్ల విదేశీ విద్యార్థులకు భారత్‌లో చదువుకోవడం మరింత సులభం కానుంది.

వ్యాపార వీసాల్లోనూ మార్పులు

వ్యాపార అవసరాల కోసం భారత్‌కు వచ్చే విదేశీయుల వీసాలను కూడా B-1, B-2గా విభజించారు.

B-1 వీసా: భారత్‌లో పరిశ్రమలు, వ్యాపార సంస్థలు స్థాపించడం వంటి దీర్ఘకాలిక వ్యాపార కార్యకలాపాల కోసం.

B-2 వీసా: స్వల్పకాలిక ఒప్పందాలు, వ్యాపార సమావేశాలు, పెట్టుబడులు, క్రీడలు, కళా ప్రదర్శనలు, సినిమా షూటింగ్‌ల వంటి కార్యకలాపాల కోసం.

ను ఏడాది చివరి నాటికి పూర్తి చేసి, కొత్త నిబంధనల ప్రకారం వీసాల జారీ ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

మొత్తంగా ఈ మార్పులు భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకులు, విద్యార్థులు, వైద్య చికిత్స పొందేవారు, పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలకు మరింత సౌకర్యవంతమైన వీసా విధానాన్ని అందించనున్నాయి.

RELATED ARTICLES

Most Popular