HomeDEVOTIONALSrisailam Temple: శివశక్తుల దివ్యక్షేత్రం.. శ్రీశైలం మల్లికార్జున స్వామి ప్రత్యేకతలు ఇవే!

Srisailam Temple: శివశక్తుల దివ్యక్షేత్రం.. శ్రీశైలం మల్లికార్జున స్వామి ప్రత్యేకతలు ఇవే!

📰 Generate e-Paper Clip

శివశక్తుల దివ్యక్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలంలో ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొలువై ఉంది. ఈ పవిత్ర క్షేత్రంను పరమశివుడు…పార్వతీదేవికి అంకితం చేశారని పురాణాలు చెబుతున్నాయి. దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా పద్దెనిమిది మహాశక్తి పీఠాలలో ఒకటిగా ఈ ఆలయం విశిష్టతను సంతరించుకుంది. ఒకే ప్రాంగణంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత.

మల్లికార్జున ఆలయంలో అప్పుడప్పుడు తేనెటీగల గుంపు చేసే సందడి వంటి శబ్దం వినిపిస్తుందని భక్తులు చెబుతుంటారు. దీనిని పార్వతీదేవి అవతారమైన భ్రమరాంబికాదేవి ఉనికికి ప్రతీకగా భావిస్తారు. అమ్మవారు తన భక్తులపై కరుణాకటాక్షాలు కురిపిస్తున్నారని భక్తుల విశ్వాసం.

దేశంలో మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు ఉండగా వాటిలో రెండో జ్యోతిర్లింగంగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామిని పేర్కొంటారు. అలాగే పద్దెనిమిది మహాశక్తి పీఠాల్లో ఆరో శక్తిపీఠంగా శ్రీ భ్రమరాంబికాదేవి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వివిధ యుగాల్లో ఎంతోమంది దేవతలు, మహర్షులు, రాజులు, యోగులు, ఆధ్యాత్మిక గురువులు మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవిని దర్శించుకుని ఆశీస్సులు పొందినట్లు పురాణ కథనాలు చెబుతున్నాయి. సత్యయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో శ్రీరాముడు, సీతాదేవి, ద్వాపరయుగంలో పాండవులు ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించినట్లు విశ్వాసం.

మల్లికార్జున జ్యోతిర్లింగ ఆవిర్భావం వెనుక ఆసక్తికరమైన పురాణగాథ ఉంది. శిలాద మహర్షి పరమశివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఘోర తపస్సు చేశాడు. ఆయన భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై రెండు కుమారులు కలిగేలా వరం ఇచ్చాడు. శిలాద మహర్షి తన కుమారులకు నంది, పర్వతుడు అని పేర్లు పెట్టాడు. వారిద్దరూ శివతత్వాన్ని, శివుని గురించి విస్తృతంగా అధ్యయనం చేశారు.

వారిలో పర్వతుడు పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి కఠోర తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చిన భోళాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు పర్వతుడు తనను ఒక పర్వతంగా మార్చాలని, కైలాసంలో ఉన్నట్లుగానే పవిత్రమైన సమస్త అంశాలు తనపై కొలువై ఉండేలా అనుగ్రహించాలని కోరాడు. భక్తులెవరూ ఇంతకుముందు కోరని ఈ కోరికకు శివుడు ఆశ్చర్యపోయాడు. అయినప్పటికీ అతడి కోరికను మన్నించి శ్రీశైలంలో పర్వత రూపంలో ఉండేందుకు అనుగ్రహించాడు. ఈ విధంగా శ్రీశైలంలో శివుడు జ్యోతిర్లింగంగా వెలిశాడని పురాణ కథనం.

అలాగే అరుణాసురుడు అనే రాక్షసుడు అమరత్వాన్ని పొందాలని ఆశించాడు. అందుకోసం మొదట గాయత్రీదేవిని ప్రార్థించగా, ఆ వరాన్ని ప్రసాదించే శక్తి తనకు లేదని ఆమె తెలిపింది. దీంతో అతడు బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు ప్రారంభించాడు. అతడి తపస్సు వల్ల ఇబ్బందులు ఎదురవుతుండటంతో దేవతలంతా బ్రహ్మదేవుడిని ఆశ్రయించారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనప్పుడు అరుణాసురుడు తనకు ఎవరూ మరణం కలిగించకూడదని వరం కోరాడు. ముఖ్యంగా రెండు కాళ్లు, నాలుగు కాళ్లు ఉన్న జీవుల వల్ల తనకు మరణం సంభవించకూడదని కోరడంతో బ్రహ్మదేవుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు.

వరబలంతో అహంకారానికి లోనైన అరుణాసురుడు లోకాలను నాశనం చేయడం ప్రారంభించాడు. దేవతలను కూడా వేధించసాగాడు. దీంతో దేవతలంతా శివపార్వతులను ఆశ్రయించారు. అప్పుడు పార్వతీదేవి వేలాది తేనెటీగల సమూహమైన భ్రమర రూపాన్ని ధరించి అరుణాసురుడిని సంహరించింది. దీంతో దేవతలంతా సంతోషించి, అమ్మవారు శాశ్వతంగా ఒక పవిత్ర ప్రదేశంలో కొలువై ఉండాలని కోరారు. ఆమెను భ్రమరాంబికగా పూజిస్తామని తెలిపారు.

తన నివాసం కోసం పార్వతీదేవి శివుడిని సంప్రదించింది. కైలాసం తర్వాత విశ్వంలో అత్యంత అందమైన ప్రదేశం ఏదని అడిగింది. అందుకు శివుడు శ్రీశైలం అత్యంత పవిత్రమైన, అందమైన ప్రదేశమని తెలిపాడు. దీంతో శివపార్వతులు శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవి రూపాల్లో కొలువై భక్తులకు ఆశీస్సులు అందించాలని నిర్ణయించుకున్నారని పురాణగాథ చెబుతోంది.

ఎన్నో శతాబ్దాలుగా లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. గర్భగుడి, ఆలయ గోడలు, స్తంభాలపై కనిపించే అద్భుతమైన శిల్పాలు భారతీయ సంస్కృతి, కళా వైభవానికి నిదర్శనంగా నిలుస్తాయి. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతత, భక్తిభావం కలుగుతాయి. మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో వేచి ఉంటారు. చారిత్రక ప్రాధాన్యత, పురాణగాథలు, అద్భుతమైన ఆలయ నిర్మాణం, ప్రకృతి సౌందర్యం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో శ్రీశైలం భక్తులకు మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని అందించే పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది.

RELATED ARTICLES

Most Popular