తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి పదవి అదృష్టం కొద్దీ వచ్చిందని ఇంకా రెండేళ్లు మాత్రమే అధికారంలో ఉంటావంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గం మునుగోడుతో పాటు కొడంగల్‌కు కూడా నిధులు కేటాయించాలని అడిగినందుకు తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్‌కు మాత్రమే కాదు, మునుగోడుకు కూడా నిధులు ఇవ్వాలని అడిగినందుకు నన్ను పండబెట్టి తొక్కుతా అంటున్నాడు. నువ్వు తొక్కితే తొక్కించుకునేలా కనిపిస్తున్నానా రేవంత్ రెడ్డి? ఏదో అదృష్టం కొద్దీ సీఎం అయ్యావు. ఇంకో రెండేళ్లు ఉంటావు. నీకు అధికారం ఉంది కదా అని నేను ఏం చేసినా నడుస్తుందని అనుకుంటే ఖబడ్దార్ బిడ్డా.. యుద్ధం మొదలవుతుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మూడేళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ అంటే కేవలం కొడంగల్, మధిర మాత్రమే కాదని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలని హితవు పలికారు.
తాను ప్రజల సొమ్ము తినే వ్యక్తిని కాదని, ప్రజాధనాన్ని కాపాడటమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. కాంట్రాక్టుల విషయంలోనూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కాంట్రాక్ట్ టెండర్ ఎంత ఉందో చెప్పండి. దానికంటే 20 శాతం తక్కువకే నేను టెండర్ వేస్తా…. ప్రజల సొమ్మును ఆదా చేస్తా అని ప్రకటించారు.
ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాజాగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో మరోసారి రాజకీయ చర్చకు దారితీశాయి.


