ఆరు గ్యారెంటీలు.. 420 హామీలు.. అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతామన్న కాంగ్రెస్ పార్టీ… మార్పు కావాలని కోరుకున్న ప్రజలు రేవంత్ రెడ్డికి అధికారం కట్టబెట్టారు. కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, పేద కుటుంబాలు ఇలా అన్ని వర్గాల ప్రజల్లోనూ రేవంత్ సర్కార్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ముఖ్యంగా ఆరు గ్యారెంటీల అమలు, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, యువ వికాసం వంటి అంశాలు ప్రభుత్వానికి సవాలుగా మారాయి.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2023 డిసెంబర్ 7న కొలువుదీరింది. డిసెంబర్ 7తో మూడేళ్లు పూర్తవుతాయి. ఈ మూడేళ్లలో రేవంత్ సర్కార్ ప్రజల అభిమానాన్ని చురగోంది తక్కువనే చెప్పాలి. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు భారీ హామీలను ఇచ్చింది. ఆరు గ్యారెంటీలతో పాటు వివిధ వర్గాలకు మేలు చేసే వాగ్దానాలు చేసింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రధాన హామీలన్నీ అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో రైతులు, మహిళలు, నిరుద్యోగులు, పేదలు కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో పథకం అమలులో జాప్యం జరుగుతోందనే విమర్శలు మొదలయ్యాయి.
ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అమలులో ఉన్నప్పటికీ మిగతా హామీల విషయంలో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రైతు భరోసా.. రూ.15 వేల హామీ ఏమైంది?
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా పథకం కింద ఏడాదికి ఎకరానికి రూ.15,000 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12,000 ఆర్థిక సాయం, వరి పంటకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించింది. అయితే రైతు భరోసా పథకంలో హామీ ఇచ్చిన రూ.15 వేల స్థానంలో ఎకరానికి రూ.12 వేల చొప్పున సాయం అందించడం విమర్శలకు కారణమైంది. మరోవైపు వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సాయం అందించే విషయంలోనూ అర్హుల ఎంపిక, అమలుపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి.రైతులకు ఇచ్చిన హామీలన్నీ ఒకేసారి నెరవేరకపోవడం, పెట్టుబడి సాయం ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూడాల్సి రావడం రైతుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. బడ్జెట్లో నిధులు కేటాయించడం ఒకటైతే, అర్హులందరికీ సమయానికి సాయం అందించడం మరో అంశం. ఈ రెండింటి మధ్య ఉన్న అంతరాన్ని ప్రభుత్వం తగ్గించాల్సి ఉంది.
రూ.2 లక్షల రుణమాఫీ.. ఇంకా మిగిలిన ప్రశ్నలు
రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా రుణమాఫీ ప్రక్రియ చేపట్టింది. అయితే సాంకేతిక కారణాలు, కుటుంబ నిర్ధారణ, రేషన్ కార్డులు, ఇతర అర్హతల సమస్యలతో కొంతమంది రైతులకు రుణమాఫీ అందలేదనే ఫిర్యాదులు వచ్చాయి. అర్హత ఉన్నప్పటికీ తమ ఖాతాల్లో రుణమాఫీ జమ కాలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివరణలు ఇస్తున్నప్పటికీ, మిగిలిన అర్హులందరికీ ఎప్పుడు పూర్తిస్థాయిలో ప్రయోజనం అందుతుందనే దానిపై స్పష్టమైన సమాధానం కావాలని రైతులు కోరుతున్నారు.
ఇందిరమ్మ ఇళ్లు.. అందరికీ అందని సొంతింటి కల!
సొంత ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అర్హులైన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. అలాగే తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయిస్తామని ప్రకటించింది. అయితే రాష్ట్రంలో సొంతింటి కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు లక్షల్లో ఉండగా తొలి విడతలో కొంతమందికే ఇళ్లు మంజూరు కావడంతో మిగతా వారిలో నిరాశ నెలకొంది. దరఖాస్తులు, అర్హుల ఎంపిక, మంజూరు, నిర్మాణానికి నిధుల విడుదల వంటి దశల్లో జాప్యం జరుగుతోందనే విమర్శలు ఉన్నాయి. ఉద్యమకారులకు 250 గజాల స్థలం హామీ విషయంలోనూ అర్హతలు, అమలు విధానం, లబ్ధిదారుల ఎంపికపై పూర్తి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
యువ వికాసం ఎక్కడ? ..నిరుద్యోగులకు ఎదురుచూపులేనా?
విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు రూ.5 లక్షల విలువైన విద్యా భరోసా కార్డులు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పింది.కానీ యువ వికాసం పథకం అమలుపై ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యా భరోసా కార్డుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులు ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో జాప్యం, నోటిఫికేషన్లు, పరీక్షలు, నియామకాల మధ్య నెలకొంటున్న అంతరాలు యువతలో అసహనాన్ని పెంచుతున్నాయి.
చేయూత పథకం.. పెన్షన్ల పెంపు హామీ ఏమైంది?
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు చేయూత పథకాన్ని ప్రకటించారు. అయితే పెన్షన్లను పెంచుతామన్న హామీ పూర్తిస్థాయిలో అమలుకాలేదనే విమర్శలు ఉన్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రయోజనం అందడం లేదని పలువురు చెబుతున్నారు. సామాజిక భద్రత కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
హైడ్రా.. పేదల ఇళ్లపై బుల్డోజర్ భయం!
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరో పెద్ద సవాలుగా మారిన అంశం హైడ్రా. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను తొలగించి హైదరాబాద్‌ను రక్షించాలనే లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అయితే అక్రమ నిర్మాణాల తొలగింపు పేరుతో సామాన్యుల ఇళ్లను కూడా కూల్చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ ఆస్తులకు సంబంధించిన పత్రాలు ఉన్నప్పటికీ నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్నారని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కూడా పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 2026 ఏప్రిల్‌లో కూల్చివేతలకు సంబంధించి నిర్దిష్ట విధివిధానాలు పాటించాలని, కొన్ని సందర్భాల్లో ఆక్రమణల తొలగింపునకు మినహా కూల్చివేతలు చేపట్టవద్దని ఆదేశించింది. ఆగస్టులోనూ నోటీసులు, చట్టపరమైన ప్రక్రియ పాటించకుండా చర్యలు తీసుకున్న వ్యవహారాలపై కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. దీంతో ఆక్రమణల తొలగింపు అవసరమే అయినప్పటికీ, నిర్దోషుల ఆస్తులకు నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది.
అప్పుల భారం అంటూ ఒకవైపు.. భారీ హామీలు మరోవైపు!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, గత ప్రభుత్వం అప్పుల భారం మిగిల్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం తరచూ చెబుతోంది. మరోవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఆర్థిక వనరుల కొరత ఉందనే చర్చ సాగుతోంది. గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం కంటే తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తుందో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకులపై ఉంది.
అధికారుల బదిలీలు.. పాలనలో స్థిరత్వం ఎక్కడ?
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మరో విమర్శ అధికారుల బదిలీల విషయంలో వినిపిస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు తరచూ జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. తరచూ అధికారులను మార్చడం వల్ల ప్రభుత్వ పథకాల అమలు, పరిపాలనా నిర్ణయాలపై ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమర్థవంతమైన పాలనకు అధికారులకు బాధ్యతలు అప్పగించడంతో పాటు వారికి తగినంత సమయం, స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
మూడేళ్లైనా కేసీఆర్‌పైనే విమర్శలు!
ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ పాలనపై రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను బయటపెట్టడం ప్రజాస్వామ్యంలో సహజమే. కానీ గత పాలకులపై విమర్శలతో పాటు ప్రస్తుత ప్రభుత్వం తన పనితీరుపై కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రైతులకు పెట్టుబడి సాయం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలకు ఆర్థిక భరోసా, పేదలకు ఇళ్లు.. ప్రజలు కోరుకుంటున్నది ఇవే. రాజకీయ విమర్శల కంటే ఈ సమస్యలకు పరిష్కారాలు చూపించడమే ప్రభుత్వానికి ముఖ్యం. కేసీఆర్ కిట్, రైతు భీమా, దళిత బంధు లాంటి అనేక పథకాలకు కోత విధించారు రేవంత్.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరీక్ష తప్పదా?
మొత్తంగా చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ మూడేళ్ల కాలం అనేక సవాళ్లతో కూడుకున్నదిగా మారింది. కొన్ని హామీలు అమలులోకి వచ్చినప్పటికీ మరికొన్ని కీలక హామీలు ఇంకా పూర్తిస్థాయిలో ప్రజలకు చేరలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రజాపాలన అంటే కేవలం పాలనలో మార్పు కాదు.. ప్రజల జీవితాల్లో కనిపించే మార్పు కావాలి…. ఆ మార్పును తీసుకురావడమే రేవంత్ రెడ్డి ముందున్న అసలైన పరీక్ష!


