మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల ఎమోషనల్ అయ్యారు. తన రెండో గర్భధారణ సమయంలో ఎదుర్కొన్న కష్టాలను వెల్లడించారు. కవల పిల్లలకు జన్మనిచ్చే క్రమంలో తాను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని తెలిపారు. ముఖ్యంగా ప్రసవం తర్వాత తీవ్ర ప్రసవానంతర డిప్రెషన్ బారిన పడ్డానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ మానసిక వేదన నుంచి పూర్తిగా కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
తన మొదటి గర్భధారణతో పోలిస్తే రెండోసారి కవల పిల్లలకు జన్మనిచ్చే ప్రయాణం చాలా కష్టంగా సాగిందని ఉపాసన తెలిపారు. ప్రసవం తర్వాత ఎదురైన మానసిక సమస్యలు తనను తీవ్రంగా ప్రభావితం చేశాయని భావోద్వేగానికి గురయ్యారు. గర్భధారణ అంటే కేవలం తొమ్మిది నెలల ప్రయాణం మాత్రమే కాదని, బిడ్డకు జన్మనివ్వడానికి ముందున్న మానసిక ఒత్తిడి నుంచి ప్రసవం తర్వాత ఎదురయ్యే భావోద్వేగ సవాళ్ల వరకు ఎన్నో అంశాలు ఇందులో భాగమని వివరించారు.
ఈ సందర్భంగా ప్రసతవం మహిళలకు కుటుంబ సభ్యులు అండగా నిలవాలని ఉపాసన సూచించారు. ప్రసవం తర్వాత మహిళలు ఎదుర్కొనే మానసిక సమస్యలను చిన్నచూపు చూడకూడదని అన్నారు. డిప్రెషన్ లేదా ఇతర భావోద్వేగ సమస్యలు ఎదురైనప్పుడు వాటిని మనసులోనే దాచుకుని బాధపడకుండా వైద్యుల సహాయం తీసుకోవాలని మహిళలకు పిలుపునిచ్చారు.
తల్లిగా మారడం ఎంతో అందమైన అనుభూతి అయినప్పటికీ ఆ ప్రయాణంలో మహిళలు ఎదుర్కొనే శారీరక, మానసిక ఇబ్బందులను కూడా సమాజం గుర్తించాలని ఉపాసన చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.


