ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’.ఈ సినిమా విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సందడి మొదలైంది. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొనగా.. భారతీయ ప్రేక్షకుల్లోనూ విపరీతమైన క్రేజ్ కనిపిస్తోంది. తాజాగా ఇండియాలో ఈ మూవీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ప్రారంభం కావడంతో అభిమానులు టికెట్ల కోసం పోటీపడుతున్నారు.
సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున నిర్వహించిన #OpenDoomsdayBookings ప్రచారానికి స్పందనగా మార్వెల్ సంస్థ టికెట్ బుకింగ్ ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సమాచారం. బుకింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే పలు నగరాల్లో టికెట్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, కొచ్చి వంటి ప్రధాన నగరాల్లో ప్రేక్షకులు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. మొదటి రోజు మొదటి షో చూడాలనే ఉత్సాహంతో అభిమానులు థియేటర్లలో తమ స్థానాలను ఖరారు చేసుకుంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ టికెట్ అమ్మకాలు 150 మిలియన్ డాలర్ల మార్కును దాటినట్లు సమాచారం. ఈ మూవీకి సంబంధించిన తొలి ట్రైలర్ కూడా రికార్డు స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. విడుదలైన 24 గంటల్లోనే 503 మిలియన్ల వ్యూస్ సాధించి, ప్రపంచంలో అత్యధిక వ్యూస్ పొందిన మూవీ ట్రైలర్లలో రెండో స్థానాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 17న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాను ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో వీక్షించే అవకాశం ఉండనుంది. ఇన్ఫినిటీ విజన్‌తో పాటు ఇతర ప్రీమియం ఫార్మాట్లలోనూ సినిమా సందడి చేయనుంది.


