తెలంగాణలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డికి హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే శిక్ష అమలును నాలుగు వారాల పాటు నిలిపివేస్తూ వెసులుబాటు కల్పించింది. హైకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని నిర్ధారించిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్లాట్లను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ పలువురు అధికారులు, సంబంధిత యజమానులు వినతులు సమర్పించారు. ఈ వినతులను పరిశీలించి 60 రోజుల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని గతంలో హైకోర్టు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. అయితే నిర్ణీత గడువులోగా కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంతో బాధితులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. కలెక్టర్‌కు తగిన అవకాశాలు ఇచ్చినప్పటికీ ఆదేశాలను అమలు చేయలేదని పేర్కొంది. ఆయన ఇచ్చిన వివరణ కూడా సంతృప్తికరంగా లేదని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు నిర్ధారిస్తూ ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది.
అయితే ఈ తీర్పుపై తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా శిక్ష అమలును నాలుగు వారాల పాటు నిలిపివేసింది. ఈ తీర్పు తెలంగాణ అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

