ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తామని ప్రకటించిన రూ.1,000 కోట్ల నిధులు ఏమయ్యాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగులు చేపట్టిన ధర్నాలో ఆమె పాల్గొని సంఘీభావం తెలిపారు. ఏడాదిన్నరగా ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉద్యోగుల సమస్యలపై యూనివర్సిటీ ఛాన్సలర్‌గా ఉన్న గవర్నర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఉద్యమాలకు ఖిల్లా అని, అలాంటి యూనివర్సిటీలో 35 ఏళ్లుగా ఉద్యోగుల రక్తం, చెమటను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించలేదని విమర్శించారు. యూనివర్సిటీలు స్వయంప్రతిపత్తితో పనిచేయాల్సి ఉన్నప్పటికీ రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదన్నారు. అన్ని యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
నాన్ పర్మినెంట్, టైమ్ స్కేల్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా కొత్త నియామకాల గురించి మాట్లాడటం సరికాదన్నారు. ముందుగా ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులపై ప్రభుత్వం ప్రేమ చూపించాలని సూచించారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్నట్లే.. ఉద్యోగి ఏడ్చిన యూనివర్సిటీ కూడా బాగుపడదని వ్యాఖ్యానించారు. నాన్ పర్మినెంట్ ఉద్యోగుల కోసం పర్మినెంట్ ఉద్యోగులు సైతం పోరాటం చేయడం అభినందనీయమని, వారికి సెల్యూట్ చేస్తున్నానని అన్నారు.
సహేతుకమైన కారణాలు లేకుండా ప్రొఫెసర్ మనోహర్‌ను సస్పెండ్ చేశారని కవిత ఆరోపించారు. ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 105 ఏళ్ల ఉస్మానియా చరిత్రలో మాదిగ బిడ్డను వైస్ ఛాన్సలర్‌గా నియమించామని సీఎం గొప్పగా చెబుతున్నారని, అయితే యూనివర్సిటీకి ప్రకటించిన రూ.1,000 కోట్ల నిధులు ఇవ్వకపోతే వీసీ మాత్రం ఏం చేయగలరని ప్రశ్నించారు. నిధులు ఇవ్వకుండా వీసీని బలిపశువును చేస్తారా? లేక ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారా? అని నిలదీశారు.
ముఖ్యమంత్రితో పోరాడి యూనివర్సిటీని అభివృద్ధి చేసిన వీసీలు చరిత్రలో నిలిచిపోతారని, స్వార్థ ప్రయోజనాల కోసం యూనివర్సిటీ ప్రయోజనాలను తాకట్టు పెట్టి ప్రభుత్వానికి గులాంగా వ్యవహరించే వీసీలను చరిత్ర క్షమించదని వ్యాఖ్యానించారు. యూనివర్సిటీకి వచ్చి ఉద్యోగులు, విద్యార్థులను ఆదుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు.
నాన్ పర్మినెంట్, టైమ్ స్కేల్ ఉద్యోగులకు ఈపీఎఫ్ ప్రయోజనాలు సక్రమంగా అందడం లేదని కవిత ఆరోపించారు. ఉద్యోగులకు ఏటా చెల్లించాల్సిన మొత్తాలను క్రమం తప్పకుండా చెల్లించాలని, మరణించిన టైమ్ స్కేల్, కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల వ్యవస్థను తొలగించి అందరినీ పర్మినెంట్ చేయాలని, రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే వారికి కూడా ఈహెచ్ఎస్ ఆరోగ్య పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అలాగే స్థానికులకు 85 శాతం ఉద్యోగాలు కల్పించాల్సి ఉండగా, యూనివర్సిటీలో సెక్యూరిటీ సిబ్బందిలో బీహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారే ఎక్కువగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.
పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) తీసుకొస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు. 2001 నుంచి 2004 మధ్య నియమితులైన వారికి ఓపీఎస్ వర్తింపజేయాలని, ఆ తర్వాత నియమితులైన వారికి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం పట్టువదలకుండా పోరాటం కొనసాగించాలని కవిత పిలుపునిచ్చారు. ఆరు ఉద్యోగ సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి చేస్తున్న ఉద్యమం కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పోరాటంలో మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషకరమని, మహిళలు ముందుండి నడిపించే ఉద్యమాలు విజయవంతమవుతాయని అన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంతో చేసే పోరాటంలో తమ పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు.
అదే సమయంలో తమ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బరిలో ఉన్న శ్రీకాంత్ గౌడ్, ఆకాశ్‌లకు ఉద్యోగులు, విద్యార్థులు మద్దతు ఇవ్వాలని కవిత కోరారు. వారిలో ఒకరు కాకతీయ యూనివర్సిటీకి, మరొకరు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థులని గుర్తుచేస్తూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

