న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా మరోసారి ఆధిపత్యం చాటుకుంది. హామిల్టన్‌లోని సెడ్డన్ పార్క్ వేదికగా జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దీంతో భారత్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగా రెండు న్యూజిలాండ్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. ఒకవేళ రెండు మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో టీమిండియా గెలిచినా సిరీస్ భారత్ సొంతం అవుతుంది.
రెండు రోజులుగా హామిల్టన్‌లో వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ నిర్వహణపై మొదటి నుంచీ సందిగ్ధత నెలకొంది. తొలుత టాస్‌ను అరగంట ఆలస్యంగా నిర్వహించాలని నిర్ణయించారు. అయితే మళ్లీ వర్షం రావడంతో ఆలస్యం మరింత పెరిగింది. చివరకు మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు మైదానంలోకి వచ్చారు.
టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మరోసారి టాస్ ఓడిపోయాడు. అయితే ఆట ప్రారంభమయ్యేలోపే మళ్లీ చిరుజల్లులు మొదలయ్యాయి. దీంతో మైదానాన్ని కవర్లతో కప్పేశారు.
వర్షం తగ్గుతుందని భావించి స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు అంపైర్లు మైదానాన్ని పరిశీలించాల్సి ఉంది. కానీ ఆ సమయంలో వర్షం మరింత పెరిగింది. మైదానాన్ని ఆటకు సిద్ధం చేయడానికి కనీసం 30 నుంచి 40 నిమిషాల సమయం అవసరమని భావించిన అంపైర్లు.. సాయంత్రం 6.41 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు చివరి గడువు రాత్రి 8.02 గంటలు కాగా అంతకుముందే మ్యాచ్ రద్దయింది.
ఈ మ్యాచ్ కోసం భారత్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాలని నిర్ణయించింది. మరోవైపు న్యూజిలాండ్ జట్టులో బ్లెయిర్ టిక్నర్ స్థానంలో మాథ్యూ ఫిషర్‌కు అవకాశం కల్పించారు.

