తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యంగా వెలసిన కొన్ని పోస్టర్లు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. హైదరాబాద్, వరంగల్, గుంటూరు, విజయవాడ నగరాల్లో ‘సైలెంట్ పొలిటికల్ పార్టీ’ పేరుతో కనిపిస్తున్న ఈ పోస్టర్లు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా పోస్టర్లపై ఉన్న సందేశాలు, వినూత్నమైన బొమ్మలు, క్యూఆర్ కోడ్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఈ పోస్టర్లపై పాలకుడి ముఖం మారితే.. అధికారుల స్వభావం మారుతుందా? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ అధికారుల పనితీరు, వ్యవస్థలోని విధానాలు మారుతున్నాయా? అనే అంశాన్ని ఈ సందేశం ద్వారా లేవనెత్తినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా మనిషి శరీరానికి పంది ముఖాన్ని జోడించిన వ్యక్తి చిత్రాన్ని పోస్టర్లపై ముద్రించడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది.
ఈ పోస్టర్లలో సైలెంట్ పొలిటికల్ పార్టీ పేరుతో పాటు క్యూఆర్ కోడ్లను కూడా ఏర్పాటు చేశారు. వాటిని స్కాన్ చేస్తే ఎక్స్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలు ఓపెన్ అవుతున్నాయి. ఈ సోషల్ మీడియా వేదికల ద్వారా పార్టీకి సంబంధించిన సందేశాలు, రాజకీయ వ్యవస్థపై విమర్శలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో రూపొందించిన ఆడియోలు కూడా ఈ ప్రచారంలో భాగంగా వినిపిస్తున్నాయి. రాజకీయ వ్యవస్థ, పాలన, అధికారుల తీరుపై వ్యంగ్యంగా విమర్శలు చేస్తున్నట్లు సమాచారం. సంప్రదాయ రాజకీయ ప్రచారానికి భిన్నంగా పోస్టర్లు, క్యూఆర్ కోడ్లు, సోషల్ మీడియా ఖాతాలు, ఏఐ ఆడియోలను ఉపయోగించడం చర్చకు దారితీస్తోంది.
అయితే ఈ సైలెంట్ పొలిటికల్ పార్టీ వెనుక ఎవరున్నారు? ఈ ప్రచారాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు? దీని ప్రధాన ఉద్దేశం ఏమిటి? అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి పలు నగరాల్లో ఈ పోస్టర్లు కనిపించడంతో వీటి వెనుక ఉన్న వ్యక్తులు, సంస్థపై ఆసక్తి నెలకొంది.


