HomeTOURS & TRAVELSTravel: ప్రపంచంలోనే అత్యంత వేడి ప్రదేశం.. ఒక్కసారి వెళ్తే!

Travel: ప్రపంచంలోనే అత్యంత వేడి ప్రదేశం.. ఒక్కసారి వెళ్తే!

📰 Generate e-Paper Clip

అమెరికాలోని కాలిఫోర్నియా, నెవాడా రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న డెత్ వ్యాలీ నేషనల్ పార్క్ ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. అత్యధిక ఉష్ణోగ్రతలు, విశాలమైన ఎడారి ప్రాంతాలు, ఉప్పు మైదానాలు, మంచుతో కప్పుకున్న పర్వతాలు ఈ ప్రాంత ప్రత్యేకతలు. దాదాపు 1,000 మైళ్ల రహదారులు కలిగిన ఈ నేషనల్ పార్క్ ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తోంది.

డెత్ వ్యాలీ ఉత్తర అమెరికాలో అత్యంత పొడి ప్రాంతం కాగా, భూమిపై అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రదేశంగా గుర్తింపు పొందింది. వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రతలు తరచుగా 120 డిగ్రీల ఫారెన్‌హీట్ (సుమారు 49 డిగ్రీల సెల్సియస్) దాటుతుంటాయి. 1913 జులై 10న ఫర్నేస్ క్రీక్ ప్రాంతంలో 134 డిగ్రీల ఫారెన్‌హీట్ (సుమారు 56.7 డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రత నమోదైంది.

ఇక్కడి బ్యాడ్‌వాటర్ బేసిన్ సముద్ర మట్టానికి 282 అడుగుల దిగువన ఉంటుంది. మరోవైపు టెలిస్కోప్ పీక్ పర్వతం సముద్ర మట్టానికి 11,049 అడుగుల ఎత్తులో ఉంది. ఇంతటి భిన్నమైన భౌగోళిక పరిస్థితులు ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.వాతావరణం అత్యంత కఠినంగా ఉన్నప్పటికీ డెత్ వ్యాలీలో జీవవైవిధ్యం సమృద్ధిగా ఉంది. ఇక్కడ 1,000కు పైగా వృక్ష జాతులు, దాదాపు 400 జంతు జాతులు నివసిస్తున్నాయి. వీటిలో ప్రపంచంలో మరెక్కడా కనిపించని కొన్ని ప్రత్యేక జాతులు కూడా ఉన్నాయి.

దాదాపు వెయ్యి సంవత్సరాలుగా టింబిషా షోషోన్ తెగ ప్రజలు ఈ లోయలో నివసిస్తున్నారు. వారు పైన్ గింజలు, మెస్క్వైట్ పండ్లను సేకరించడంతో పాటు వేట ద్వారా జీవనం సాగించేవారు. డెత్ వ్యాలీ నేషనల్ పార్క్‌కు నేరుగా ప్రజా రవాణా సౌకర్యం లేదు. చాలామంది పర్యాటకులు సొంత వాహనాల్లోనే ఇక్కడికి చేరుకుంటారు. లాస్ వెగాస్ నుంచి కారులో సుమారు రెండు గంటలు, లాస్ ఏంజెలెస్ నుంచి దాదాపు నాలుగు గంటలు ప్రయాణించాలి.

పార్క్‌లో సెల్‌ఫోన్ నెట్‌వర్క్ చాలా పరిమితంగా ఉంటుంది. అందువల్ల ముందుగానే మ్యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక్కడ వేగంగా ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేసే సదుపాయాలు లేవు. 34 లక్షల ఎకరాలకు పైగా విస్తరించిన ఈ ప్రాంతంలో కేవలం మూడు పెట్రోల్ బంకులు మాత్రమే ఉన్నాయి.

అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు డెత్ వ్యాలీ సందర్శనకు అనువైన సమయం. వేసవిలో తీవ్రమైన ఎండలు ఉండటంతో పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అక్టోబర్ నుంచి వాతావరణం చల్లబడుతుంది. నవంబర్‌లో జరిగే చారిత్రక వాగన్ ట్రైన్ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అంతేగాదు తీవ్రమైన వేడి లేకుండా ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు.

RELATED ARTICLES

Most Popular