జపాన్‌లో చెర్రీ బ్లాసమ్ పూలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయో.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో విరబూసే జకరాండా పూలు కూడా అంతే ప్రత్యేకం. వసంతకాలం వచ్చిందంటే చాలు.. నగరంలోని రోడ్లు, పార్కులు, వీధులన్నీ ఊదా రంగు పూలతో నిండిపోతాయి. చెట్ల కొమ్మలపై గుత్తులుగా పూసే ఈ పూలు నగరానికి కొత్త అందాన్ని తీసుకొస్తాయి. ప్రకృతి ప్రేమికులు, ఫొటోగ్రఫీ ఔత్సాహికులు, పర్యాటకులకు ఈ దృశ్యం ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.
ఆస్ట్రేలియాలో వసంతకాలం ప్రకృతి అందాలను విరబూయిస్తుంది. ముఖ్యంగా అక్టోబర్ మధ్య నుంచి సిడ్నీ నగరంలో జకరాండా చెట్లు పూలతో కళకళలాడుతాయి. ఈ పూల సందడి సాధారణంగా నవంబర్ మధ్య లేదా చివరి వరకు కొనసాగుతుంది. నగరంలోని అనేక ప్రాంతాలు ఊదా రంగు పూలతో కప్పబడినట్లుగా కనిపిస్తాయి.
జకరాండా చెట్లు ఆస్ట్రేలియాకు చెందినవి కావు. దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, బొలీవియా, బ్రెజిల్ ప్రాంతాలు వీటి స్వస్థలం. 19వ శతాబ్దం మధ్యకాలంలో అంతర్జాతీయ సముద్ర వాణిజ్యం, రవాణా మార్గాల ద్వారా ఈ చెట్లు ఆస్ట్రేలియాకు చేరుకున్నాయి. సిడ్నీలోని రాయల్ బొటానిక్ గార్డెన్లో సుమారు 1850 ప్రాంతంలోనే తొలి జకరాండా చెట్లలో ఒకదాన్ని నాటారు. ఇప్పటికీ అది దేశంలోని పురాతన జీవించి ఉన్న జకరాండా చెట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. అనంతరం 1864లో బ్రిస్బేన్ సిటీ బొటానిక్ గార్డెన్స్ తొలి క్యూరేటర్ వాల్టర్ హిల్ దక్షిణ అమెరికా నుంచి తీసుకొచ్చిన విత్తనాలతో జకరాండా మొక్కను అధికారికంగా నాటారు.
ఆ తర్వాత మైఖేల్ గిల్‌ఫాయిల్ వంటి ల్యాండ్‌స్కేప్ డిజైనర్లు 1880లలో ఈ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించారు. 20వ శతాబ్దంలో జోసెఫ్ మైడెన్ వంటి పట్టణ ప్రణాళిక నిపుణుల కృషితో సిడ్నీతో పాటు ఇతర ఆస్ట్రేలియా నగరాల్లోనూ వీటిని రోడ్ల వెంట పెద్ద సంఖ్యలో నాటడం ప్రారంభించారు. ప్రస్తుతం జకరాండా పూలు ఆస్ట్రేలియా వసంతకాలానికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తున్నాయి.
సిడ్నీలో జకరాండా పూల అందాలను ఆస్వాదించాలనుకునేవారు తప్పక సందర్శించాల్సిన ప్రాంతాల్లో మెక్‌డౌగల్ స్ట్రీట్ ఒకటి. ఇక్కడ రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు కొమ్మలను విస్తరించి ఊదా రంగు పూలతో అందమైన పందిరిలా కనిపిస్తాయి. ప్రశాంతమైన నివాస ప్రాంతం కావడంతో ఈ దృశ్యం పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది.సముద్రతీరం, పచ్చని పరిసరాలు, ఊదా రంగు పూల కలయిక ఈ ప్రాంతాలకు మరింత ఆకర్షణను తీసుకొస్తుంది.
లావెండర్ బే: ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణాన్ని ఇష్టపడేవారికి లావెండర్ బే మంచి ఎంపిక. ఇక్కడి పార్కులు, హార్బర్ అందాలకు జకరాండా పూలు తోడవడంతో ఈ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తుంది.
నార్త్ సిడ్నీ: చెట్లతో నిండిన రహదారులు, అందమైన వీధి దృశ్యాలు నార్త్ సిడ్నీ ప్రత్యేకత. వసంతకాలంలో ఇక్కడి జకరాండా చెట్లు పూలతో నిండిపోయి పర్యాటకులను ఆకర్షిస్తాయి.
పారామట్టా: చారిత్రక పార్కులు, పచ్చని ప్రదేశాలకు ప్రసిద్ధి చెందిన పారామట్టాలోనూ జకరాండా పూల అందాలను ఆస్వాదించవచ్చు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో విరబూసే ఈ పూలు వసంతకాలపు సందడిని మరింత పెంచుతాయి.


