బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరటనిచ్చే వార్త. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. బలహీనమైన స్పాట్ మార్కెట్ డిమాండ్, మదుపరుల నుంచి అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ఈ విలువైన లోహాల ధరలు దిగివచ్చాయి.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ డెలివరీకి సంబంధించిన బంగారం ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ.1,877 తగ్గింది. దీంతో 1.37 శాతం క్షీణించి రూ.1,34,828 వద్ద ట్రేడయింది. ఈ కాంట్రాక్టుకు సంబంధించి మొత్తం 15,567 లాట్ల ట్రేడింగ్ నమోదైంది. మార్కెట్‌లో స్పాట్ డిమాండ్ బలహీనపడటం బంగారం ధరల పతనానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి. డిసెంబర్ డెలివరీకి సంబంధించిన వెండి ఫ్యూచర్స్ ధర కిలోకు రూ.6,567 తగ్గింది. దీంతో 2.19 శాతం క్షీణించి రూ.1,69,742 వద్దకు చేరుకుంది. ఈ కాంట్రాక్టులో 17,090 లాట్ల ట్రేడింగ్ జరిగింది. మార్కెట్‌లో ట్రేడర్లు, ఇతర మదుపరులు పెద్దఎత్తున అమ్మకాలకు దిగడంతో వెండి ధరలపై ఒత్తిడి పెరిగినట్లు విశ్లేషకులు వెల్లడించారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు క్షీణించాయి. న్యూయార్క్ మార్కెట్‌లో బంగారం ఫ్యూచర్స్ ధర 0.64 శాతం తగ్గి ఔన్స్‌కు 3,861.35 డాలర్లకు చేరుకుంది. వెండి ధర మరింతగా 3.59 శాతం పడిపోయి ఔన్స్‌కు 47.36 డాలర్ల వద్ద ట్రేడయింది.


