Cricket Australia: 2018లో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసిన శాండ్‌పేపర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఘటనపై మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా తన జీవిత చరిత్ర ‘సబ్ర్’ (Sabr) పుస్తకంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తీవ్రంగా స్పందించాడు. ఖవాజా చేసిన వ్యాఖ్యలను పచ్చి అబద్ధం , అర్థంపర్థం లేనివి అంటూ కొట్టిపారేశాడు.
తన పుస్తకంలో ఖవాజా సంచలన విషయాలను వెల్లడించాడు. శాండ్‌పేపర్ వ్యవహారం గురించి ఆస్ట్రేలియా జట్టు మొత్తానికి తెలుసునని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలు తీసుకున్న ముగ్గురు ఆటగాళ్లకే ఈ వ్యవహారం పరిమితం కాలేదని పేర్కొన్నాడు. ఈ పుస్తకం విడుదలైన తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్‌కు చెందిన పలువురు ఆటగాళ్లు దీనిపై స్పందిస్తున్నారు.
ఈ వివాదంపై తాజాగా పాట్ కమిన్స్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉస్మాన్ ఖవాజా తన స్నేహితుడే అయినప్పటికీ తనతో పాటు ఇతరుల జీవితాలు, ప్రతిష్ఠను దెబ్బతీసేలా పుస్తకంలో వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నాడు.
ఉస్మాన్ నాకు స్నేహితుడు. అయితే స్నేహితుల జీవితాలు, ప్రతిష్ఠకు సంబంధించిన విషయాలను తేలిగ్గా తీసుకోకూడదు. తన పుస్తకంలో నా జీవితంతో పాటు మరికొందరి జీవితాలు, ఆస్ట్రేలియా క్రికెట్ ప్రతిష్ఠను కూడా అతను తేలికగా ప్రస్తావించాడు అన్నారు.
శాండ్‌పేపర్‌ను మైదానంలో ఉపయోగించబోతున్నారని జట్టులోని అందరికీ తెలుసు అని ఖవాజా చెబుతున్నట్లయితే.. అది పూర్తిగా తప్పు. గత ఎనిమిదేళ్లుగా ఇదే విషయాన్ని నేను చెబుతున్నాను. ఆ సమయంలో శాండ్‌పేపర్ వినియోగం గురించి నాకు తెలియదు. అంతేకాదు బాల్ టాంపరింగ్ కోసం ఒక ప్రణాళిక రూపొందించడంలో నేను, మరికొందరు కీలక పాత్ర పోషించామని ఖవాజా తన పుస్తకంలో పేర్కొన్నాడు. ఇది పూర్తిగా అబద్ధం. అర్థంపర్థం లేని ఆరోపణ అని కమిన్స్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో బాల్ టాంపరింగ్ కోసం శాండ్‌పేపర్ ఉపయోగించిన ఘటన ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు సృష్టించింది. ఈ వ్యవహారంలో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌పై చర్యలు తీసుకున్నారు. తాజాగా ఖవాజా తన పుస్తకంలో చేసిన వ్యాఖ్యలతో ఈ పాత వివాదం మరోసారి చర్చకు వచ్చింది.


