HomeENTERTAINMENTPujita Ponnada: ఆదర్శ కుటుంబం టీమ్ నన్ను మోసం చేసింది!

Pujita Ponnada: ఆదర్శ కుటుంబం టీమ్ నన్ను మోసం చేసింది!

📰 Generate e-Paper Clip

వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆదర్శ కుటుంబం. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. అయితే తాజాగా ఈ సినిమాలో నటించిన హీరోయిన్ పూజిత పొన్నాడ చిత్ర బృందంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా మోసం చేశారని ఆరోపించింది.

ఈ సినిమా కోసం చిత్ర బృందం తనను పూర్తి స్థాయి పాత్ర కోసం సంప్రదించిందని పూజిత వెల్లడించింది. దర్శకుడు త్రివిక్రమ్ స్వయంగా లుక్ టెస్టులు నిర్వహించి తనను ఎంపిక చేశారని తెలిపింది. రచయిత తనకు పూర్తి కథను వివరించారని, సినిమాలో తన పాత్ర మొదటి నుంచి చివరి వరకు ఉంటుందని చెప్పారని పేర్కొంది. నారా రోహిత్‌తో కలిసి కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉంటాయని హామీ ఇచ్చినట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఒప్పందంపై సంతకం చేసి అడ్వాన్స్ కూడా తీసుకున్నానని చెప్పింది.

కొన్ని రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత దాదాపు మూడు నెలల పాటు చిత్ర బృందం నుంచి ఎలాంటి సమాచారం లేదని పూజిత తెలిపింది. తన పాత్రను తగ్గించబోమని అప్పట్లో హామీ ఇచ్చారని కానీ చివరకు తనకు తెలియకుండానే ఓ సీనియర్ నటిని ఆ పాత్రలోకి తీసుకున్నారని ఆరోపించింది.

సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత తన పాత్ర కేవలం ఒక్క సన్నివేశానికే పరిమితమైందని చూసి షాక్‌కు గురైనట్లు చెప్పింది. రీషూట్ చేయడానికి కూడా చిత్ర బృందానికి సమయం లేకపోవడంతో అదే సన్నివేశాన్ని సినిమాలో ఉంచారని వెల్లడించింది. కనీసం సినిమా టైటిల్స్‌లోనూ తన పేరును ప్రస్తావించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంత కీలకమైన పాత్ర ఉంటుందని హామీ ఇచ్చి చివరకు ఒక్క సన్నివేశానికే పరిమితం చేయడం తనను మోసం చేయడమేనని పూజిత వ్యాఖ్యానించింది.

RELATED ARTICLES

Most Popular