బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను క్రమంగా బలపడుతూ తీవ్ర తుపానుగా మారింది. దీంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. నవంబర్ 20న నెల్లూరు నుంచి విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలను తుపాను దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది.
బంగాళాఖాతంలోని దక్షిణ, పశ్చిమ మధ్య ప్రాంతాల్లో కొనసాగుతున్న అక్వాన్ తుపాను గత ఆరు గంటల్లో గంటకు సుమారు 3 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదిలింది. నవంబర్ 18 ఉదయం 5.30 గంటల సమయానికి ఇది తీవ్ర తుపానుగా బలపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ప్రస్తుతం తుపాను క్రమంగా వాయవ్య దిశగా కదులుతూ నవంబర్ 20 మధ్యాహ్నం సమయంలో నెల్లూరు నుంచి విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలను దాటే అవకాశం ఉందని తెలిపింది. తీరాన్ని దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది.
అక్వాన్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వర్షాలు, బలమైన గాలుల ప్రభావం ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ సాయంత్రం నుంచి తీర ప్రాంతాల్లో గాలుల వేగం పెరిగే అవకాశం ఉందని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
తుపాను ప్రభావంతో రైల్వే కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. రైల్వే ట్రాక్‌లు, మౌలిక సదుపాయాల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. రైళ్ల సురక్షిత రాకపోకలకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.


