ఇరాన్ దేశంలోని ఒక మారుమూల గ్రామం ప్రపంచవ్యాప్తంగా వింత చర్చకు కేంద్రబిందువుగా మారింది. అచ్చం హాలీవుడ్ సినిమా ‘గల్లీవర్స్ ట్రావెల్స్’ లోని ‘లిల్లిపుట్’ దేశాన్ని తలపించే ఈ గ్రామంలో నివసించే మనుషుల ఎత్తు కేవలం 3 అడుగులు మాత్రమే ఉంటుంది. ఇక్కడి ఇళ్ల నిర్మాణాలు, మనుషుల జీవనశైలి చాలా భిన్నంగా ఉండి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఇరాన్-అఫ్గానిస్తాన్ సరిహద్దు సమీపంలోని సౌత్ ఖోరాసాన్ ప్రావిన్స్‌లో ఉన్న ఈ ‘మఖునిక్’ గ్రామం దాదాపు 1500 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఇక్కడ నివసించే ప్రజల సగటు ఎత్తు కేవలం 3 అడుగుల నుంచి 3.5 అడుగుల వరకు మాత్రమే ఉంటుంది.
చిన్న ఇళ్లు – తక్కువ ఎత్తు ఉన్న తలుపులు: ఈ గ్రామంలోని ఇళ్లన్నీ మట్టితో నిర్మించబడి ఉంటాయి. ఈ ఇళ్ల ప్రధాన ద్వారాలు కేవలం 3 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటాయి. దీంతో ఇళ్లలోకి వెళ్లాలంటే పెద్దవారు కూడా తల వంచుకుని లేదా సర్పాకారంలో లోపలికి వెళ్లాల్సి వస్తుంది.
గతంలో సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, తీవ్రమైన పోషకాహార లోపం మరియు ఇంటర్-మ్యారేజీలు (సంతతిలో రక్త సంబంధ వివాహాలు) ఎక్కువగా జరగడం వల్లే ఇక్కడి ప్రజల ఎత్తు పెరగలేదని నిపుణులు భావిస్తున్నారు. ఆ కాలంలో ఇక్కడి ప్రజలు ఎక్కువగా బార్లీ, ఖర్జూరాలు, మరియు స్థానికంగా లభించే ఆకుకూరలపైనే ఆధారపడి జీవించేవారు.
కాలక్రమేణా మారుతున్న ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా ఈ గ్రామంలో కూడా మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడి కొత్త తరానికి చెందిన యువత సాధారణ ఎత్తుతోనే జన్మిస్తున్నారు. రహదారి సౌకర్యాలు మెరుగవ్వడం, మంచి పౌష్టికాహారం అందడంతో ఈ గ్రామంలోని ప్రజల జీవన ప్రమాణాలు మారుతున్నాయి.
పాత కాలపు నాటి సుమారు 200 మట్టి ఇళ్లలో ఇప్పటికీ 70 నుంచి 80 వరకు ఇళ్లు చెక్కుచెదరకుండా నిలబడి ఉన్నాయి. ఈ వింత గ్రామానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పర్యాటకులు ఈ అద్భుతాన్ని కళ్లారా చూసేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు.


