Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Land Scam: సామాన్యులపై భూ బకాసురుల పంజా..

Author
Posted By STAR TRINETHRAM
| 01 Apr 2026, 10:10 AM | Crime
Land Scam: సామాన్యులపై భూ బకాసురుల పంజా..

* కోట్ల విలువైన భూములను కుమ్మేస్తున్న మోసగాళ్లు..

* చట్టబద్ధ ప్లాట్లపై అక్రమ హక్కుల డ్రామా..

* హనుమకొండ శివారులో భూ మాఫియా అరాచకం..

* నకిలీ సొసైటీతో కోట్ల రూపాయల భూ మోసం..

* కోర్టులో కేసు ఉన్నా కొనసాగుతూనే ఉన్న రిజిస్ట్రేషన్లు

* ప్లాన్ ప్రకారం భూముల కబ్జా.. బాధితుల సంచలన ఆరోపణలు

* భారీ దందాకు నాయకులు, పోలీసుల సహకారం..?

* ప్రమాదంలో అమాయకుల చెమటచిందిన ఆస్తులు

* ఇది నమ్మకాన్ని కోల్పోయిన బాధితుల నిశ్శబ్ద అరుపు

* ఇంతపెద్ద వ్యవస్థలో న్యాయం జరిగే దిక్కే లేదా..?

* న్యాయం కోసం ఎదురు చూస్తున్న నేల గుండె ధ్వని

ఇవి కూడా చదవండి

Land Scam: హనుమకొండ జిల్లాలో వెలుగులోకి వచ్చిన భారీ భూ మోసం ఆరోపణలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. హసన్‌పర్తి మండలం కొమటిపల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 520, 521, 522, 523, 524లో జరిగిన ఈ వ్యవహారం సాధారణ భూ వివాదం కాదని, పథకం ప్రకారం అమాయకుల ఆస్తులను కాజేయడానికి రూపొందించిన పెద్ద కుట్రగా బాధితులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా 520/1, 520/3, 520/4, 520/6, 520/7, 521/1, 521/2, 521/3, 521/5, 521/7, 521/8, 521/9, 522/3, 522/4, 522/5, 522/6, 523/1, 523/2, 523/3, 523/5, 523/6, 523/7, 523/8, 523/9, 523/10, 523/11, 524/1, 524/2, 524/3, 524/4 వంటి విస్తీర్ణాల్లో చట్టబద్ధంగా ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు ఇప్పుడు తమ సొంత భూములపైనే అనిశ్చితి, భయం, ఆందోళనల మధ్య జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. మొదట్లో అన్ని లావాదేవీలు సక్రమంగా జరిగినప్పటికీ, తరువాత కాలంలో నకిలీ పత్రాలు సృష్టించి అసలు యజమానుల హక్కులను సవాలు చేసే పరిస్థితులు ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, పోలీసుల అండ ఉందన్న అనుమానం బాధితుల్లో భయాందోళనలను మరింత పెంచుతోంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం చూసినట్లయితే..

2004 నుంచి 2006 మధ్య కాలంలో సుమారు 60 మందికి పైగా కలిసి మొత్తం 71 ప్లాట్లు కొనుగోలు చేసినట్లు బాధితులు వివరించారు. ప్రతి ఒక్కరూ తమ జీవితకాల పొదుపులతో ఈ భూములను సొంతం చేసుకున్నారని చెబుతున్నారు. కొందరు నేరుగా అసలు యజమానుల నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకోగా, మరికొందరు మధ్యవర్తుల ద్వారా జీపీఏ ఆధారంగా పత్రాలు పొందారు. ఆ సమయంలో అన్ని పత్రాలు చట్టబద్ధంగా ఉన్నాయని నమ్మి కొందరు ప్రహరీలు కట్టగా, మరికొందరు ఇళ్లు కూడా నిర్మించుకున్నారు. అయితే కాలక్రమేణా ఈ భూములపై మూడో వ్యక్తులు అకస్మాత్తుగా హక్కులు వాదించడం ప్రారంభించడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని బాధితులు చెబుతున్నారు. తమ కష్టార్జిత ఆస్తి కోల్పోయే ప్రమాదం ఉందన్న భావనతో వారు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

హనుమకొండ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి వేగంగా పెరగడంతో ఈ భూముల విలువలు అమాంతం పెరిగాయి. ఇదే పరిస్థితిని ఆసరాగా తీసుకున్న కొందరు వ్యక్తులు భూములపై కన్నేసి, యజమానులను బెదిరించడం, మోసం చేయడం, నకిలీ పత్రాలు సృష్టించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూముల ధరలు పెరిగిన తర్వాతే ఈ సమస్యలు ప్రారంభమయ్యాయని, దీనికి వెనుక స్పష్టమైన ప్రణాళిక ఉందని బాధితులు వాపోతున్నారు. ముఖ్యంగా పత్రాల్లో మార్పులు చేయడం, నకిలీ సంతకాలు సృష్టించడం వంటి అంశాలు బయటపడుతున్నాయని చెబుతున్నారు.

ఈ వ్యవహారంలో 2019లో జరిగిన పరిణామాలు కీలకంగా మారినట్లు తెలుస్తోంది. శ్రీదేవి, సంపత్, జంపయ్య అనే వ్యక్తులు కొందరు కో-ఆపరేటివ్ సొసైటీ అధికారులతో కుమ్మక్కై “ఎస్.ఆర్.మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్” పేరిట నకిలీ సంస్థను ఏర్పాటు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ సొసైటీకి చట్టబద్ధత లేకపోయినా, దానిని చట్టబద్ధ సంస్థగా చూపిస్తూ తప్పుడు పత్రాలు తయారు చేసి భూములపై హక్కులు ఉన్నట్లు చూపించినట్లు చెబుతున్నారు. నకిలీ సంతకాలు, తప్పుడు రికార్డులు వినియోగించినట్లు విచారణలో బయటపడిందని బాధితులు పేర్కొంటున్నారు. అసలు యజమానుల అనుమతి లేకుండానే కొత్త లేఅవుట్లు సృష్టించి రిజిస్ట్రేషన్లు జరిపిస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు.

ఈ మోసం వెలుగులోకి వచ్చిన తర్వాత బాధితులు పలుమార్లు అధికారులను ఆశ్రయించినప్పటికీ, ఇప్పటి వరకు సరైన చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12-05-2023న మొదటి ఫిర్యాదు నుంచి ప్రారంభమైన పోరాటం 2023, 2024, 2026 వరకు కొనసాగుతూనే ఉందని చెబుతున్నారు. 06-09-2023న కేయూ పోలీస్ స్టేషన్‌కు, 26-09-2023న హనుమకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదులు ఇచ్చినా స్పష్టమైన పరిష్కారం లభించలేదని అంటున్నారు. ఈ వ్యవహారంలో కొందరు రాజకీయ నాయకులు, పోలీస్ అధికారుల ప్రమేయం ఉందని సూచనలు వచ్చినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రతి సారి ఇది సివిల్ వివాదమని చెప్పి తప్పించుకోవడం బాధితులను నిరాశకు గురిచేస్తోంది.

ఇప్పటికీ వివాదాస్పద సర్వే నెంబర్లలో రిజిస్ట్రేషన్లు కొనసాగుతుండటం తమకు అతిపెద్ద ప్రమాదమని బాధితులు అంటున్నారు. అసలు పట్టాదారుల రిజిస్ట్రేషన్లు రద్దు చేయకుండా కొత్తగా మళ్లీ మళ్లీ రిజిస్ట్రేషన్లు జరగడం చట్టవిరుద్ధమని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఈ ప్లాట్లను కొనుగోలు చేస్తే డబ్బుతో పాటు ఆస్తి కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం లేదా ఉద్దేశపూర్వక సహకారంతో ఈ అక్రమాలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్నారు.

మున్సిపల్, అభివృద్ధి సంస్థల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. KUDA, GWMC ద్వారా 2019 తర్వాత ఇచ్చిన లేఅవుట్ అనుమతులను రద్దు చేయాలని, ఇప్పటికే ఇచ్చిన నిర్మాణ అనుమతులను కూడా రద్దు చేసి అవసరమైతే కూల్చివేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పాత రిజిస్ట్రేషన్లు ఉన్నప్పటికీ కొత్త లేఅవుట్లు ఎలా మంజూరు అయ్యాయో విచారణ జరపాలని కోరుతున్నారు.

ఈ వ్యవహారం కోర్టులో OS No.1041/2023గా కొనసాగుతున్నప్పటికీ, బాధితుల్లో ఆందోళన తగ్గడం లేదు. కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ లావాదేవీలు కొనసాగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. విచారణలో భాగంగా 45 సంతకాలు నకిలీవిగా నిర్ధారించబడ్డాయని, మొత్తం భూమికి క్లియర్ టైటిల్ ఉన్నట్లు తేలిందని చెబుతున్నారు. 06-10-2023న FIR No.567/2023 నమోదు అయినప్పటికీ, అది కోర్టుకు పంపకుండా రికార్డుల నుంచి తొలగించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

బాధితులలో ఒకరు గుమ్మడివెల్లి సాయిబాబు మాట్లాడుతూ.. తమ సమస్యను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి పీఏ, మాజీ మంత్రి హరీశ్ రావులకు కూడా వాట్సప్ ద్వారా తెలియజేశామని చెప్పారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదులు ఇచ్చినా ఇప్పటి వరకు సరైన చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూములపై ఎలాంటి రుణాలు, లావాదేవీలు చేయవద్దని బ్యాంకులకు కూడా లేఖలు పంపినట్లు తెలిపారు.

NOTE: ఈ భూ వివాదంపై ఎవరికైనా, ఏమైనా అనుమానాలున్నా లేదా పూర్తి సమాచారం కావాలన్నా సెల్ నెంబర్: 98489 28913ని సంప్రదించాలని బాధితులలో ఒకరు గుమ్మడివెల్లి సాయిబాబు ఈ సందర్బంగా కోరారు.

ALSO READ: Charishma Reddy: రాజకీయాల్లోకి జీవన్ రెడ్డి కోడలు?

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: