Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Phone tapping case: కేసీఆర్ అనుమానితుడా?.. నిందితుడా?

Author
Posted By STAR TRINETHRAM
| 02 Feb 2026, 07:46 PM | Crime
Phone tapping case: కేసీఆర్ అనుమానితుడా?.. నిందితుడా?

Phone tapping case: గత రెండు వారాలుగా తెలంగాణ రాజకీయ వాతావరణం మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసు చుట్టూనే తిరుగుతోంది. ఒకప్పుడు నెమ్మదిగా సాగిందన్న విమర్శలు ఎదుర్కొన్న ఈ కేసు దర్యాప్తు ఇప్పుడు ఒక్కసారిగా ఊపందుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సంచలనంగా మారిన ఈ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం వేగం పెంచింది. ఇప్పటికే బీఆర్ఎస్‌లో కీలక నేతలు, ఉన్నతాధికారులను విచారించిన సిట్.. ఆదివారం గులాబీ బాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దాదాపు నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. కేసీఆర్ విచారణ పూర్తవడంతో ఈ కేసులో తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై సర్వత్రా చర్చ మొదలైంది.

ఇప్పటివరకు సిట్ నమోదు చేసిన స్టేట్‌మెంట్లు, సేకరించిన ఆధారాల ఆధారంగా త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం ఊపందుకుంది. ఈ కేసులో కీలక ఆధారాలు చేతికి రావడంతో కేసీఆర్‌ను సిట్ ఏ స్థాయిలో పేర్కొనబోతోందన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. ఆయనను అనుమానితుడిగా మాత్రమే చార్జిషీట్‌లో ప్రస్తావిస్తారా? లేక నేరుగా నిందితుడిగా పేర్కొంటారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ విచారణ తర్వాత ఈ కేసు మరింత కీలక మలుపు తిరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

రెండేళ్ల క్రితం నమోదైన ఈ కేసు మొదట్లో నత్తనడకన సాగిందన్న ఆరోపణలు తీవ్రంగా వచ్చాయి. అయితే సీపీ సజ్జనార్ నేతృత్వంలో రెండో సిట్ ఏర్పాటు అయిన తర్వాత దర్యాప్తులో స్పష్టమైన మార్పు కనిపించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించిన కేటీఆర్, హరీశ్ రావు, సంతోశ్ రావుతో పాటు పలువురు ఉన్నతాధికారులను సిట్ ఇప్పటికే విచారించినట్లు తెలుస్తోంది. వారి వాంగ్మూలాల ఆధారంగానే కేసీఆర్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో ఈ కేసును ఇక తుది దశకు తీసుకెళ్లేందుకు సిట్ కసరత్తు ప్రారంభించినట్లు టాక్ వినిపిస్తోంది.

ఆదివారం జరిగిన విచారణలో కేసీఆర్‌ను పలు కీలక అంశాలపై ప్రశ్నించిన సిట్.. ఈ కేసులో సూత్రధారులు ఎవరు? అమలు చేసిన పాత్రధారులు ఎవరు? అనే అంశాలపై స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎలా మొదలైంది..? ఎవరి ఆదేశాల మేరకు సాగింది..? వ్యవస్థను ఎలా వినియోగించుకున్నారన్న అంశాలపై కీలక ఆధారాలు సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ కేసులో త్వరలోనే చార్జిషీట్ దాఖలు అవుతుందన్న అంచనాలు బలపడుతున్నాయి. ఆ చార్జిషీట్‌లో ఎవరెవరి పేర్లు ఉండబోతున్నాయన్నది రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

కేసీఆర్ విచారణ పూర్తైన నేపథ్యంలో సిట్ తదుపరి చర్యలు ఏవైపు ఉంటాయన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒక వర్గం మాత్రం గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తిని విచారించిన తర్వాత ఇక మిగిలింది ఏముంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. మరోవైపు, కేసీఆర్ కుటుంబ సభ్యుల దాకా విచారణ వెళ్లే అవకాశం ఉందన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ముఖ్యంగా కేసీఆర్ కూతురు కవిత, ఆమె భర్తను సిట్ ప్రశ్నించే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సిట్ పిలిస్తే విచారణకు హాజరవుతానని కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలే ఈ చర్చకు బలం చేకూరుస్తున్నాయని అంటున్నారు.

ఇక కేసీఆర్ విచారణ పూర్తవడంతో ఈ కేసులో అరెస్టులు కూడా ఉండొచ్చన్న ప్రచారం తెరపైకి వచ్చింది. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఫోన్ ట్యాపింగ్ అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుండటంతో, అవసరమైతే నోటీసులు లేకుండానే అరెస్టులు జరిగే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే ముందుగా ఎవరిపై వేట పడుతుందన్నది సస్పెన్స్‌గా మారింది. ఇప్పటికే అనేక సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రాబోయే రోజుల్లో రాజకీయంగా, చట్టపరంగా ఏం జరగబోతోందన్నది వేచి చూడాల్సిందే అన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.

ALSO READ: BSNL free offer: ప్రైవేట్ కంపెనీలకు చుక్కలే!

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: