Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Phone Tapping: సిట్ విచారణ.. కేసీఆర్‌ని అడిగిన ప్రశ్నలివే!

Author
Posted By STAR TRINETHRAM
| 01 Feb 2026, 06:28 PM | Crime
Phone Tapping: సిట్ విచారణ.. కేసీఆర్‌ని అడిగిన ప్రశ్నలివే!

Phone Tapping: తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం సుదీర్ఘంగా విచారించింది. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నందినగర్‌లోని ఆయన నివాసంలో ప్రారంభమైన ఈ విచారణ 4 గంటలకుపైగా కొనసాగినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం వరకు సాగిన ఈ విచారణలో సిట్ అధికారులు కేసుకు సంబంధించిన కీలక అంశాలపై వరుసగా ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.

నందినగర్ నివాసంలోనే ఆరుగురు సభ్యులతో కూడిన సిట్ బృందం కేసీఆర్‌ను విచారించింది. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా మారిన సాక్షుల వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా ప్రశ్నలు సిద్ధం చేసిన అధికారులు.. వాటిని కేసీఆర్ ముందుంచి వివరణ కోరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన ఆడియోలు ఎలా బయటకు వచ్చాయి అనే అంశంపై సిట్ అధికారులు సుదీర్ఘంగా ఆరా తీశారు. ఈ ఆడియోలు ఫోన్ ట్యాపింగ్ ద్వారానే లభించాయా అనే కోణంలో ప్రశ్నలు సాగినట్లు తెలిసింది.

ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఎవరి సూచనలతో జారీ అయ్యాయనే అంశం ఈ విచారణలో ప్రధానంగా నిలిచింది. ఇంటెలిజెన్స్ అధికారులకు ఫోన్ ట్యాపింగ్ చేయమని స్వయంగా ఆదేశాలు జారీ చేశారా అనే ప్రశ్నను కేసీఆర్‌ను నేరుగా అడిగినట్లు సమాచారం. ఈ ట్యాపింగ్ ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఏ సంవత్సరంలో ఈ ప్రక్రియ మొదలైంది అనే అంశాలపై కూడా సిట్ అధికారులు స్పష్టత కోరినట్లు తెలుస్తోంది. భద్రతా అవసరాల కోసమేనా లేక రాజకీయ అవసరాల కోసమా అనే ప్రశ్నలతో విచారణ తీవ్రత పెరిగినట్లు సమాచారం.

ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారా, అలాంటి ఆదేశాలు ఇచ్చారా అనే అంశాలపై కూడా అధికారులు నేరుగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ ప్రశ్నలకు కేసీఆర్ ఇచ్చిన సమాధానాలు ఈ కేసు దిశను నిర్ణయించే కీలకంగా మారనున్నాయని సిట్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పాత్రపై కూడా విచారణలో విస్తృతంగా చర్చ జరిగింది. పదవీకాలం ముగిసిన తర్వాత ప్రభాకర్ రావుకు మరోసారి పొడిగింపు ఎందుకు ఇచ్చారు, ఆ నిర్ణయం వెనుక కారణాలేమిటి అనే అంశాలపై కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఒకే వ్యక్తికి రెండు కీలక పోస్టులు అప్పగించడం పరిపాలనా నియమావళికి విరుద్ధం కాదా అనే అంశంపై కూడా సిట్ అధికారులు ఆరా తీశారు. ఈ నిర్ణయాలకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ సాగినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సమయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారనే సమాచారం మీకు ఎలా తెలిసిందని, ఆ సమాచారం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వచ్చిందా అనే అనుమానాలతో అధికారులు విచారణ చేసినట్లు సమాచారం. అంతేకాదు, ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలుకు పార్టీ నిధులు వినియోగించారా అనే అంశంపైనా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిధులు కాకుండా పార్టీ ఫండ్ ఎందుకు ఉపయోగించాల్సి వచ్చిందనే విషయంపై కూడా వివరణ కోరినట్లు సమాచారం.

ఈ విచారణలో అత్యంత సంచలనంగా మారిన అంశం ఎలక్టోరల్ బాండ్స్‌కు సంబంధించిన ప్రశ్నగా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. బీఆర్ఎస్‌కు ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన వారి ఫోన్ నంబర్లు ట్యాపింగ్ జాబితాలో ఎందుకు ఉన్నాయనే ప్రశ్నను సిట్ అధికారులు లేవనెత్తినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కేసీఆర్ నుంచి స్పష్టమైన వివరణ తీసుకునేందుకు అధికారులు ప్రయత్నించినట్లు సమాచారం.

మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ నిర్ణయం ఎలా తీసుకున్నారు, దానికి సంబంధించిన అధికారిక ఫైళ్లు ఏమైనా ఉన్నాయా, భద్రతా కారణాల పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం ట్యాపింగ్ జరిగిందా అనే అంశాలపై సిట్ అధికారులు సమగ్రంగా విచారణ జరిపినట్లు తెలుస్తోంది. కేసీఆర్ వయస్సు, భద్రతా కారణాల దృష్ట్యా ఆయన నివాసంలోనే విచారణ జరిపినట్లు అధికారులు పేర్కొన్నారు.

విచారణ సమయంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావు, న్యాయ నిపుణులు నందినగర్ నివాసంలోనే ఉన్నట్లు సమాచారం. ఈ విచారణను రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ నేతలు మాత్రం ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణమని విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడెక్కుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

ALSO READ: Chicken Effect: రాత్రిపూట చికెన్ తింటున్నారా?

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: