Sleep banking: ‘స్లీప్ బ్యాంకింగ్’ అనే కొత్త భావన ఇటీవలి కాలంలో విస్తృతంగా చర్చకు వస్తోంది. పని దినాల్లో నిద్ర లేమితో ఇబ్బంది పడే చాలామంది, వారాంతాల్లో లేదా టైమ్ దొరికినప్పుడు ఎక్కువ గంటలు నిద్రపోతే ఆ నిద్రను తర్వాత ఉపయోగించుకోవచ్చన్న ఆలోచనతో ఉంటున్నారు. అలారం ఆపేసి కావాల్సినంత సేపు నిద్రపోవడం, మిస్సయిన రెస్ట్‌ను తిరిగి పొందడం సాధారణ వ్యూహంగా మారింది. అయితే నిజంగానే నిద్రను బ్యాంక్ బ్యాలెన్స్‌లా నిల్వ చేసుకుని, అవసరమైనప్పుడు వాడుకోవచ్చా? ఈ ప్రశ్నకు శాస్త్రవేత్తలు, నిద్ర నిపుణులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
స్లీప్ బ్యాంకింగ్ అంటే.. భవిష్యత్తులో తక్కువ నిద్రపోవాల్సి వచ్చే అవకాశాన్ని ఊహించి, ముందుగానే కొన్ని రోజుల పాటు అదనపు గంటలు నిద్రపోవడం. కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఇది కొంతవరకు ఉపయోగకరంగా ఉండొచ్చు. మెదడు, శరీరం అవసరమైన వనరులను ముందుగానే సమీకరించుకోవడం వల్ల నిద్ర లేమి సమయంలో అప్రమత్తత కొంతవరకు మెరుగుపడుతుందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత, సుదూర ప్రయాణాలు, పెద్ద కార్యక్రమాలు లేదా షిఫ్ట్ వర్క్‌కు ముందు ఈ విధానం ‘సేఫ్టీ నెట్’లా పనిచేస్తుందని వెల్నెస్ నిపుణులు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు ప్రచారం చేస్తున్నారు.
ఈ భావనకు శాస్త్రీయ ప్రాతిపదిక 2009లో వచ్చింది. అమెరికాలోని వాల్టర్ రీడ్ ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్‌లో స్లీప్ రీసర్చర్లు సైనికులపై నిర్వహించిన అధ్యయనాల్లో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. ఒక బృందానికి రాత్రికి 7 గంటలు, మరో బృందానికి 10 గంటలు నిద్రపోయే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత వారందరికీ కేవలం 3 గంటల నిద్ర మాత్రమే అనుమతించారు. ఫలితంగా ముందుగా ఎక్కువ నిద్రపోయిన వారు, తక్కువ నిద్రపోయిన వారితో పోలిస్తే మెరుగైన అప్రమత్తత, పనితీరు కనబరిచారు. నిద్ర లేని పరిస్థితుల్లో ‘స్లీప్ బ్యాంకింగ్’ ఒక రకమైన మానసిక, శారీరక రోగనిరోధక శక్తిలా పనిచేస్తుందన్న అభిప్రాయం అక్కడే మొదలైంది.
తరువాతి సంవత్సరాల్లో వైద్యులు, క్రీడాకారులపై జరిగిన పరిశోధనల్లోనూ ఇదే తరహా ఫలితాలు కనిపించాయి. నైట్ షిఫ్ట్‌లో పనిచేసే డాక్టర్లు ముందుగా అదనపు గంటన్నర నిద్రపోవడం వల్ల, తర్వాతి వారాల్లో షిఫ్ట్ పనిలో మెరుగ్గా పని చేసినట్లు అధ్యయనాలు సూచించాయి. క్రీడాకారుల విషయంలోనూ అదనపు నిద్ర శారీరక ఒత్తిడిని తగ్గించి, కచ్చితత్వం, వేగాన్ని పెంచిందని పరిశోధనలు చెబుతున్నాయి. రగ్బీ, టెన్నిస్, బాస్కెట్‌బాల్, సెయిలింగ్ వంటి క్రీడల్లో పాల్గొనే ఆటగాళ్లు స్లీప్ బ్యాంకింగ్‌ను అనుసరించడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించినట్లు అధ్యయనాలు వెల్లడించాయి.
అయితే స్లీప్ బ్యాంకింగ్‌పై విమర్శలూ ఉన్నాయి. భవిష్యత్తు కోసం నిద్రను నిజంగా నిల్వ చేయడం సాధ్యం కాదని కొంతమంది నిద్ర శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. శరీరం ముందుగానే నిద్రను దాచుకోదు, కేవలం అప్పటివరకు వచ్చిన నిద్ర లోటును మాత్రమే భర్తీ చేస్తుందన్నది వారి అభిప్రాయం. షిఫ్ట్ వర్కర్లపై చేసిన కొన్ని అధ్యయనాల్లో అదనపు నిద్ర వల్ల దీర్ఘకాలికంగా పనితీరు మెరుగుపడినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని కూడా చెబుతున్నారు.
నిద్ర ఎందుకు అవసరమంటే.. శరీరంలోని ప్రతి కణానికి అది అత్యవసరం. నిద్రలో జీవక్రియ, హార్మోన్ల సమతుల్యత, నాడీ వ్యవస్థ పునరుద్ధరణ జరుగుతుంది. రోజంతా పేరుకుపోయే వ్యర్థాలను మెదడు నిద్ర సమయంలోనే తొలగిస్తుంది. తగినంత నిద్ర లేకపోతే దృష్టి లోపం, పనితీరు తగ్గడం, మానసిక ఒత్తిడి, శారీరక సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువ మంది పెద్దవాళ్లకు రోజుకు 7 నుంచి 9 గంటల నిద్ర అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
స్లీప్ బ్యాంకింగ్ కొంతమందికి తాత్కాలికంగా ఉపశమనం ఇవ్వొచ్చు కానీ ఇది దీర్ఘకాలిక పరిష్కారం కాదన్నది నిపుణుల సూచన. ఇప్పటికే నిద్రలేమితో బాధపడుతున్నవారికి ఇది ఎంతవరకు పనిచేస్తుందన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. అందుకే నిపుణులు ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి లేవడం వంటి క్రమబద్ధమైన నిద్ర షెడ్యూల్‌ను పాటించాలని సూచిస్తున్నారు. అదనపు అరగంట లేదా గంట నిద్ర అప్పుడప్పుడూ ఉపకరించవచ్చు గానీ, నాణ్యమైన నిద్రను అలవాటు చేసుకోవడమే అసలైన పరిష్కారం అని చెబుతున్నారు.
ALSO READ: Collector: ఎన్నికల నిబంధనల అమలులో రాజీ ఉండదు
Last Updated on February 9, 2026 · 10:21 PM by Star Trinethram



