HomeTELANGANAKavitha: విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమా..?,ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయంపై కవిత ఫైర్

Kavitha: విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమా..?,ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయంపై కవిత ఫైర్

📰 Generate e-Paper Clip

55 ఏళ్లుగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ బోర్డును విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా రద్దు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఇంటర్ బోర్డు రద్దు వల్ల ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు దెబ్బతినే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.

‘ఇంటర్ బోర్డు రద్దు – తెలంగాణ విద్యపై ప్రభావం’ అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత మాట్లాడారు. సమావేశంలో పాల్గొని అభిప్రాయాలు వెల్లడించిన ప్రొఫెసర్ నాగేశ్వర్, కె. శ్రీనివాస్ తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమాజంలో కీలకమైన సమస్యలు తలెత్తినప్పుడు మేధావులు మౌనంగా ఉండటం మంచిది కాదని, వారి అభిప్రాయాలు ప్రజల భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాల్లో కీలకమని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి ప్రకటనలకు, అధికారుల నిర్ణయాలకు పొంతన లేదు

గత ఏడాది నుంచి ఇంటర్మీడియట్ వ్యవస్థ రద్దుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రకటనల్లో స్పష్టత లేదని కవిత విమర్శించారు. ఇంటర్ ప్రవేశాలు నిలిపివేస్తామని ప్రకటించిన కొన్ని నెలలకే అధికారులు ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారని గుర్తుచేశారు. అనంతరం ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారని భావిస్తున్న సమయంలో మళ్లీ ఇంటర్ బోర్డు రద్దు అంశాన్ని తెరపైకి తీసుకురావడం ప్రభుత్వంలో సమన్వయ లోపానికి నిదర్శనమని ఆరోపించారు.దశాబ్దాలుగా కొనసాగుతున్న విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావాలంటే సమగ్ర అధ్యయనం, స్పష్టమైన కార్యాచరణ అవసరమని పేర్కొన్నారు. కోట్లాది మంది ప్రజలపై ప్రభావం చూపే నిర్ణయాలను తొందరపాటుతో తీసుకోవడం సరికాదన్నారు.

పేద, మధ్యతరగతి విద్యార్థుల అవకాశాలను దెబ్బతీయొద్దు

తెలంగాణలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు విద్యే ప్రధాన ఆధారమని కవిత పేర్కొన్నారు. తల్లిదండ్రులు కష్టపడి పిల్లలను చదివించడం వల్ల ఎంతోమంది ఇంజనీర్లు, వైద్యులుగా ఎదిగి కుటుంబాల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకున్నారని గుర్తుచేశారు.ఇంటర్మీడియట్ వ్యవస్థలో ప్రతిపాదిస్తున్న మార్పులు విద్యార్థుల ఉన్నత విద్య, వృత్తి విద్య అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.

సామాజిక న్యాయం గురించి కాంగ్రెస్ నాయకత్వం మాట్లాడుతున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు.విద్యా సంస్కరణలకు ముందుగా ఇతర రాష్ట్రాల అనుభవాలను అధ్యయనం చేయాలని కవిత సూచించారు. మహారాష్ట్రలో పదో తరగతి, ఇంటర్మీడియట్ స్థాయి బోర్డులు సమన్వయంతో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఇంటర్మీడియట్ వ్యవస్థ విలీనానికి సంబంధించిన ప్రయోగం ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చిందని తెలిపారు. పొరుగు రాష్ట్రాల అనుభవాలను పరిశీలించకుండా తెలంగాణలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని ప్రశ్నించారు.విద్యా సంస్కరణలకు ముందుగా వాటి ఆచరణ సాధ్యతను నిరూపించే అధ్యయనం, ప్రయోగాత్మక విధానం ఉండాలని అభిప్రాయపడ్డారు.

ఇంటర్ బోర్డు రద్దు వంటి కీలక నిర్ణయానికి ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించారా? విద్యావేత్తలతో చర్చించారా? ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, జూనియర్ కాలేజీ అధ్యాపకులు, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, సంబంధిత సంఘాల అభిప్రాయాలు తీసుకున్నారా? అని కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ప్రజాస్వామ్యంలో చర్చలే ప్రధానమని, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు తక్కువగా ఉన్నాయని, దాదాపు 65 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారని పేర్కొన్నారు. ముందుగా ప్రభుత్వ విద్యాసంస్థలపై ప్రజల్లో నమ్మకం పెంచే చర్యలు చేపట్టాలని సూచించారు.

ఇంటర్మీడియట్ వ్యవస్థలో ప్రతిపాదిస్తున్న మార్పులు కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రయోజనం కలిగించేలా ఉన్నాయనే అనుమానం వ్యక్తమవుతోందని కవిత ఆరోపించారు.ప్రభుత్వం సంబంధిత వర్గాలతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోందని విమర్శించారు.విద్యను కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకు అనుగుణంగా మార్చే ప్రయత్నాలను వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.

తొమ్మిది నుంచి పన్నెండో తరగతి వరకు ఒకే విద్యావ్యవస్థ కిందకు తీసుకువస్తే తెలంగాణ విద్యార్థుల స్థానికత, ప్రవేశాలు, పరీక్షల నిర్వహణలో సమస్యలు తలెత్తే ప్రమాదముందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు.ఇతర రాష్ట్రాల్లో ప్రవేశాలు పొంది తెలంగాణలో పరీక్షలు రాసే పరిస్థితులు ఏర్పడితే వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం వద్ద ఎలాంటి వ్యవస్థ ఉందని ప్రశ్నించారు.

గ్రూప్-1 నియామకాల్లో స్థానికతపై వచ్చిన అభ్యంతరాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణ విద్యార్థుల స్థానిక అవకాశాలను పరిరక్షించడంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాల వెనుక ఇతర రాష్ట్రాల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారనే అనుమానం కలుగుతోందని ఆరోపించారు.

హైదరాబాద్ నగరంలో కూడా ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్న పాఠశాలలు ఉన్నాయని, మరుగుదొడ్లు, కంప్యూటర్ ల్యాబ్‌లు, ఫిజిక్స్ ల్యాబ్‌లు లేని విద్యాసంస్థలు ఉన్నాయని పేర్కొన్నారు.ఉపాధ్యాయుల కొరత, మౌలిక సదుపాయాల లేమి, విద్యా పరిపాలనలో సమస్యలను పరిష్కరించకుండా వ్యవస్థల విలీనంతో విద్యా నాణ్యత పెరగదని అభిప్రాయపడ్డారు.ఇంటర్మీడియట్ బోర్డు రద్దు నేపథ్యంలో సుమారు 7,500 మంది జూనియర్ కాలేజీ అధ్యాపకుల భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.

అధ్యాపకుల ఉద్యోగ భద్రత, విధులు, సర్వీసు నిబంధనలు, పరిపాలనా వ్యవస్థపై ఎలాంటి కార్యాచరణ రూపొందించారో వెల్లడించాలని కోరారు.విద్యాశాఖలో ఇప్పటికే పరిపాలనాపరమైన సమస్యలు ఉన్నాయని, జిల్లా, మండల స్థాయిలో విద్యాధికారుల నియామకాలు, బాధ్యతల నిర్వహణలో ఇబ్బందులు కొనసాగుతున్నాయని విమర్శించారు.విద్యా సంస్కరణల విషయంలో కేరళ అనుభవాలను పరిశీలించాలని కవిత సూచించారు. అక్కడ దీర్ఘకాలిక ప్రణాళికతో, దశలవారీగా నిధులు కేటాయిస్తూ విద్యావ్యవస్థలో మార్పులు చేపట్టారని పేర్కొన్నారు.

తెలంగాణలోనూ సంస్కరణలు తీసుకురావాలంటే ముందుగా సమగ్ర అధ్యయనం చేసి, అవసరమైన ఆర్థిక వనరులు కేటాయించి, సంబంధిత వర్గాల అభిప్రాయాలతో కార్యాచరణ రూపొందించాలని సూచించారు.తెలంగాణ విద్యావ్యవస్థ పరిస్థితిపై గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత తీవ్రంగా విమర్శించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విద్యావ్యవస్థను ఐసీయూలో పెడితే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటిలేటర్‌పై పెట్టిందని వ్యాఖ్యానించారు.విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ఆచరణ సాధ్యం కాని నిర్ణయాలతో మరిన్ని ఇబ్బందులు సృష్టిస్తున్నారని విమర్శించారు.మూడు నెలల సమయం ఇచ్చి అన్ని జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి..ఇంటర్మీడియట్ బోర్డు రద్దుకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం తీసుకురావాలనుకుంటే కనీసం మూడు నెలల సమయం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాలు నిర్వహించాలని, విద్యావేత్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యాసంస్థల యాజమాన్యాలు, సంబంధిత సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

ఇంటర్ బోర్డు రద్దు ప్రతిపాదనను ప్రభుత్వం పునఃపరిశీలించి వెనక్కి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.ప్రభుత్వం ముందుకే వెళ్తే విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యావేత్తలు, ఇతర రాజకీయ పక్షాలతో సంప్రదించి ఐక్య ఉద్యమాలు నిర్మిస్తామని హెచ్చరించారు.ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తమకు తెలిపాయని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular