Jay Shah: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) చైర్మన్‌గా జై షా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోసారి ఆయననే చైర్మన్‌గా కొనసాగించాలని ఐసీసీ బోర్డు నిర్ణయించింది. ఇండోనేషియాలోని బాలిలో జరిగిన ఐసీసీ బోర్డు, కమిటీ సమావేశాల్లో డైరెక్టర్లు జై షా పేరును ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఎవరూ పోటీగా నిలవకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఐసీసీ ఇవాళ అధికారికంగా ప్రకటించింది.
జై షా నాయకత్వంపై ఐసీసీ బోర్డు పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది. క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కీలక సమయంలో ఆయన కొనసాగింపు ఎంతో ముఖ్యమని అభిప్రాయపడింది. అంతర్జాతీయంగా క్రికెట్ అభిమానుల సంఖ్యను పెంచడం, కొత్త దేశాలకు ఈ క్రీడను విస్తరించడం, వాణిజ్యపరంగా మరింత అభివృద్ధి చేయడం వంటి లక్ష్యాలను ఐసీసీ తన భవిష్యత్ ప్రణాళికల్లో చేర్చుకుంది.
రెండోసారి తనపై నమ్మకం ఉంచిన ఐసీసీ బోర్డు, డైరెక్టర్లకు జై షా కృతజ్ఞతలు తెలిపారు. ఐసీసీ చైర్మన్‌గా పనిచేయడం గౌరవంతో పాటు బాధ్యత కూడా అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధికి సభ్య దేశాలతో కలిసి పనిచేస్తానని వెల్లడించారు.
క్రికెట్ చరిత్రలో అత్యంత కీలకమైన, ఆసక్తికరమైన దశలోకి ప్రవేశిస్తోందని జై షా అన్నారు. 2028లో లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ తిరిగి చోటు దక్కించుకోవడం ద్వారా కొత్త ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం లభిస్తుందని తెలిపారు. కొత్త తరం ఆటగాళ్లు, అభిమానులను ప్రోత్సహించేందుకు ఇది గొప్ప వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
జై షా 2024 డిసెంబర్ 1న తొలిసారి ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.


