ICC: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2035 వరకు జరిగే పురుషుల క్రికెట్ టోర్నమెంట్ల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఇండోనేషియాలోని బాలిలో నిర్వహించిన ఐసీసీ బోర్డు సమావేశాల అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 2029 ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుండగా 2031 వన్డే ప్రపంచకప్‌ను భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. అలాగే 2027 వన్డే ప్రపంచకప్, 2028 టీ20 ప్రపంచకప్ సహా మూడు ప్రధాన టోర్నీలకు సంబంధించిన అర్హత విధానాలను కూడా ఐసీసీ ప్రకటించింది.
ఐసీసీ ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం 2029 ఛాంపియన్స్ ట్రోఫీ అక్టోబర్ 9 నుంచి 28 వరకు భారత్‌లో జరగనుంది. 2031 వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 9 నుంచి నవంబర్ 23 వరకు భారత్, బంగ్లాదేశ్ సంయుక్త ఆతిథ్యంలో నిర్వహించనున్నారు.
ఇక 2028 టీ20 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అక్టోబర్ 12 నుంచి నవంబర్ 12 వరకు ఈ టోర్నీ జరగనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ఇంగ్లండ్ వేదిక కానుంది. 2028 డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 8 నుంచి 12 వరకు జరగనుంది.
2030 టీ20 ప్రపంచకప్‌ను ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. జూలై 4 నుంచి ఆగస్టు 4 వరకు ఈ టోర్నీ జరగనుంది. 2031 డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. జూన్ 12 నుంచి 16 వరకు ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు.
2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ తిరిగి చోటు దక్కించుకున్న నేపథ్యంలో అర్హత పోటీల నిర్వహణకు సంబంధించి కూడా ఐసీసీ కీలక ప్రకటన చేసింది. పురుషుల అర్హత పోటీలు 2028 ఫిబ్రవరి 5 నుంచి 13 వరకు బంగ్లాదేశ్‌లో జరగనున్నాయి. మహిళల అర్హత పోటీలు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5 వరకు అమెరికాలో నిర్వహించనున్నారు.
2035 వరకు ప్రధాన టోర్నీల షెడ్యూల్‌ను ఖరారు చేయడం ద్వారా ఆటగాళ్లు, అసోసియేట్ సభ్య దేశాలకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకునే అవకాశం కలుగుతుందని ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా తెలిపారు. అత్యుత్తమ ప్రదర్శన కార్యక్రమాలు, క్రమబద్ధమైన క్రికెట్ క్యాలెండర్‌కు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.


