రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే షాక్ ఇచ్చింది. దశాబ్దాలుగా అమల్లో ఉన్న రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సిలేషన్ (RAC) విధానాన్ని పూర్తిగా తొలగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ విధానం అమల్లో ఉంటే ఒకే బెర్త్‌ను ఇద్దరు ప్రయాణికులకు కేటాయిస్తారు. ఇద్దరి దగ్గరా పూర్తి టికెట్ ఛార్జీ వసూలు చేసినప్పటికీ పడుకునేందుకు మాత్రం సగం బెర్త్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యం, టికెట్ ధరలకు అనుగుణంగా వసతి కల్పించాలనే అంశాల నేపథ్యంలో రైల్వేశాఖ ఈ విధానాన్ని పునఃసమీక్షిస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం వెల్లడించింది.
అయితే ఆర్ఏసీ విధానాన్ని రద్దు చేస్తూ రైల్వేశాఖ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఇది పరిశీలన దశలోనే ఉంది. ఒకవేళ ఈ విధానంలో మార్పులు జరిగితే రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకునే లక్షలాది మంది ప్రయాణికులపై ప్రభావం పడే అవకాశం ఉంది.
RAC అంటే రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సిలేషన్. ఈ విధానాన్ని భారతీయ రైల్వే 1980వ దశకంలో ప్రవేశపెట్టింది. రైలులో అన్ని బెర్తులు నిండిపోయినప్పటికీ, ప్రయాణికులకు రిజర్వేషన్ కోచ్‌లో ప్రయాణించే అవకాశం కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం.
ఈ విధానంలో సాధారణంగా ఒక సైడ్ లోయర్ బెర్త్‌ను ఇద్దరు RAC ప్రయాణికులకు కేటాయిస్తారు. పగటిపూట ఇద్దరూ కూర్చునేందుకు వీలుగా ఉంటుంది. రాత్రి సమయంలో మాత్రం అదే బెర్త్‌ను ఇద్దరూ పంచుకోవాల్సి వస్తుంది. ఇద్దరి నుంచి పూర్తి టికెట్ ధర వసూలు చేసినప్పటికీ, ప్రత్యేకంగా పడుకునేందుకు ఒక్కొక్కరికి పూర్తి బెర్త్ లభించదు.
ఒకవేళ ఇతర ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకుంటే ఖాళీ అయిన బెర్తులను RAC ప్రయాణికులకు కేటాయించే అవకాశం ఉంటుంది. దీంతో RAC టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.
RAC టికెట్ ఉన్న ప్రయాణికులకు పూర్తి బెర్త్ లభించకపోయినా పూర్తి టికెట్ ఛార్జీ వసూలు చేయడం అన్యాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాత్రిపూట సుదూర ప్రయాణాలు చేసేవారికి ఒకే బెర్త్‌ను ఇద్దరు పంచుకోవడం అసౌకర్యంగా మారుతోంది. అంతేకాకుండా ఒకే బెర్త్‌ను పురుషుడు, మహిళకు కేటాయించిన సందర్భాల్లోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రత్యామ్నాయ బెర్తులు అందుబాటులో లేకపోవడంతో టీటీఈలు కూడా సమస్యలను పరిష్కరించడంలో ఇబ్బందులు పడుతున్నారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం RAC టికెట్ ఉన్న ప్రయాణికులు రైలులో ప్రయాణించవచ్చు. ప్రయాణానికి ముందు లేదా ప్రయాణ సమయంలో ఇతర ప్రయాణికులు టికెట్లు రద్దు చేసుకోవడం వల్ల బెర్తులు ఖాళీ అయితే నిబంధనల ప్రకారం వాటిని RAC ప్రయాణికులకు కేటాయిస్తారు. అయితే ప్రతి RAC ప్రయాణికుడికి ప్రత్యేక బెర్త్ లభిస్తుందని హామీ లేదు. ఖాళీ బెర్తు లభించకపోతే కేటాయించిన సీటింగ్ సదుపాయంతోనే ప్రయాణం కొనసాగించాల్సి ఉంటుంది.
RAC టికెట్‌కు, వెయిటింగ్ లిస్ట్ టికెట్‌కు మధ్య కూడా తేడా ఉంది. RAC ప్రయాణికులకు రిజర్వేషన్ కోచ్‌లో ప్రయాణించేందుకు అనుమతి ఉంటుంది. అయితే చార్ట్ తయారీ తర్వాత కూడా కన్ఫర్మ్ కాని పూర్తిగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ఈ-టికెట్లకు వేర్వేరు నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం RAC టికెట్లను రైల్వేశాఖ రద్దు చేయలేదు. కొత్త విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై కూడా అధికారిక సమాచారం లేదు. కాబట్టి ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైల్వేశాఖ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలే కొనసాగుతాయి.


