Gold Theft: తమిళనాడులోని ప్రముఖ నగరమైన మధురైలో భారీ బంగారం చోరీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నగరంలోని ప్రసిద్ధ ‘తనిష్క్’ (Tanishq) నగల షోరూంలో సుమారు 15 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు మాయమవడం వ్యాపార వర్గాల్లో, ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ భారీ చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మధురై పోలీసులు, దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా భావిస్తున్న నిషాంత్‌పై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఇందులో భాగంగా నవంబర్ 13న పోలీసులు మదకుళం ప్రాంతంలోని నిషాంత్ నివాసానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. అక్కడే నిందితుడిని అదుపులోకి తీసుకుని చోరీ జరిగిన తీరు, దొంగిలించిన బంగారాన్ని ఎక్కడ దాచారు అనే కోణాల్లో సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ దొంగతనంలో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా? చోరీ సొత్తును రికవరీ చేసే దిశగా పోలీసులు తమ విచారణను కొనసాగిస్తున్నారు.


