తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జననేత ఈటల రాజేందర్. వామపక్ష భావజాలంతో విద్యార్థి దశలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న ఈటల…. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంత్రిగా ఆ తర్వాత లెఫ్ట్ నుండి రైట్‌కు(బీజేపీ)లో చేరిక వరకు ఆయన రాజకీయ ప్రస్థానం ఎన్నో సవాళ్లతో కూడుకుంది.
ఒకప్పుడు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఈటల.. ఆ తర్వాత అదే కేసీఆర్‌తో రాజకీయంగా ఢీకొట్టే స్థాయికి ఎదిగారు. బీఆర్ఎస్‌లో కీలక నేతగా, మంత్రిగా కొనసాగారు. రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పడ్డ విభేదాలు అనూహ్య పరిణామాల మధ్య పార్టీని వీడి బీజేపీలో చేరారు. ప్రస్తుతం మల్కాజిగిరి ఎంపీగా జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. తెలంగాణ బీజేపీలో బలమైన క్యాడర్ కలిగిన నేతగా, బీజేపీ అధిష్టాన పెద్దలతో అతి తక్కువ కాలంలోనే నేరుగా కలిసేంత చనువు సంపాదించుకున్న నాయకుడిగా పార్టీలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా, ఎంపీగా ఎన్నికైనఈటల రాజకీయ ప్రస్థానం ఎంతోమందికి స్పూర్తిదాయాకం.
విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి
ఈటల రాజేందర్ 1964 మార్చి 20న ప్రస్తుత తెలంగాణలోని హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో జన్మించారు. మల్లయ్య, వెంకటమ్మ దంపతులకు జన్మించిన ఆయన.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఎస్సీ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే సామాజిక, రాజకీయ అంశాలపై ఆసక్తి పెంచుకున్నారు. విద్యార్థి సంఘాల కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వామపక్ష భావజాలంతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. ప్రజా సమస్యలపై పోరాటాల ద్వారా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.
కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్‌లో చేరిక
2003లో కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా సాగిన ఉద్యమంలో పార్టీ తరఫున గళమెత్తారు. అనంతరం 2004లో కమలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 2009లోనూ గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం హుజూరాబాద్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. వరుస విజయాలతో తెలంగాణ రాజకీయాల్లో బలమైన నాయకుడిగా ఎదిగారు. అసెంబ్లీలో టీఆర్ఎస్ఎల్పీ నేతగా బాధ్యతలు నిర్వహించారు.
వైఎస్ హయాంలో తెలంగాణకు జరుగుతున్న దోపిడిని సమర్ధవంతంగా ఎత్తిచూపారు.ఒకానొక దశలో వైఎస్..ఈటలను వ్యక్తిగతంగా దూషించే స్థాయికి వెళ్లారంటే తెలంగాణ వాదాన్ని ఈటల ఎంత బలంగా వినిపించారో అర్ధంచేసుకోవచ్చు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలోని తొలి ప్రభుత్వంలో ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు దక్కాయి. తెలంగాణ తొలి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తొలి ప్రసంగంలోనే వైఎస్ హయాంలో తనకు జరిగిన అవమానాన్ని ప్రస్తావిస్తూ..అదే చోట మంత్రిగా ఉన్నానని అది ప్రజలు ఇచ్చిన దీవెన అని చెప్పకనే చెప్పారు.
2018 ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి మరోసారి విజయం సాధించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వంలో వైద్యారోగ్య శాఖ నిర్వహించారు. అయితే 2021లో ఆయన రాజకీయ జీవితంలో పెను తుఫాను అనే చెప్పాలి. కేసీఆర్‌తో వచ్చిన విభేదాలు, భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో 2021 మే 1న ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించారు. ఈ చర్యతో కేసీఆర్, ఈటల మధ్య విభేదాలు బహిరంగమయ్యాయి.తనపై వచ్చిన ఆరోపణలను ఈటల రాజేందర్ ఖండించారు. అనంతరం ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.
లెఫ్ట్ నుండి రైట్‌కు…బీజేపీలో చేరిక
2021 జూన్ 14న ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయన చేరికతో తెలంగాణలో బీజేపీకి ఒక బలమైన నాయకత్వం లభించింది. అదే ఏడాది అక్టోబర్ 30న జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల సందర్భంగానే కేసీఆర్ దళితబంధు స్కీంను తీసుకొచ్చి హుజురాబాద్ నుండి ప్రారంభించారు. ఈటలను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డినా ప్రజలు మాత్రం రాజేందర్ వైపే నిలిచారు.
గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్‌తో పాటు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన గజ్వేల్‌లోనూ పోటీ చేశారు. అయితే రెండు నియోజకవర్గాల్లోనూ ఆయన ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ కేసీఆర్‌తో నేరుగా తలపడిన నాయకుడిగా రాజకీయ చర్చల్లో నిలిచారు.
జాతీయ రాజకీయాల్లోకి.. మల్కాజిగిరి ఎంపీగా విజయం
అనంతరం జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్ భారీ విజయం సాధించారు. దీంతో రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం లోక్‌సభ సభ్యుడిగా బీజేపీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జవహర్‌నగర్ డంప్ యార్డు కోసం కదం తొక్కినా, రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమస్య వచ్చినా తొలుత వినిపించే పేరు రాజేందరన్నదే.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తారని చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తనకంటూ ఓ బలమైన క్యాడర్‌ను తయారు చేసుకున్న ఈటల పేరు ప్రధమంగా వినిపిస్తోంది. ఒకప్పుడు కేసీఆర్‌తో కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నాయకుడు.. ఆ తర్వాత రాజకీయ ప్రత్యర్థిగా మారడం వరకు , వామపక్ష భావజాలం నుండి కాషాయ జెండా వరకు ఇలా ప్రతి దశలోనూ ఆయన రాజకీయ జీవితం ముళ్లపానుపే. ఆకలి విలువ తెలిసిన నేత కాబట్టే నాటి ఉద్యమ సమయం నుండి నేటి వరకు సమస్యలతో తన ఇంటికి వచ్చిన ప్రతిఒక్కరి కడుపు నింపుతున్నారు. ఎమ్మెల్యే, మంత్రిగా, ఎంపీగా తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్న ఈటల.. ప్రజా సమస్యలపై రాజీలేని పోరు చేసే నేతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అందుకే ఆయన సన్నిహితులే కాదు ప్రజలు సైతం జననేత ఈటల అని కొనియాడుతున్నారు.


