పండుగల వేళ ఆధునిక ఫ్యాషన్ ట్రెండ్స్‌తో పాటు సంప్రదాయ భారతీయ వస్త్రధారణకు కూడా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. తాజాగా బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ తన దీపావళి లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. బనారసీ శైలిని తలపించే భారీ లెహంగాను ధరించి పాతకాలపు రాజసం ఉట్టిపడేలా కనిపించారు.
కంగనా ధరించిన లెహంగా సంప్రదాయ భారతీయ కళానైపుణ్యానికి అద్దం పట్టేలా ఉంది. ఆమె బ్లౌజ్‌ను లేత పింక్, పీచ్, గోల్డ్ రంగుల మేళవింపుతో రూపొందించారు. మెడ భాగం నుంచి చేతుల వరకు పూలు, సంప్రదాయ ఆకృతులతో కూడిన దట్టమైన ఎంబ్రాయిడరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక లెహంగా స్కర్ట్ మాత్రం మెరూన్, ముదురు ఎరుపు, రస్ట్ రంగుల్లో రూపొందించారు. దానిపై క్రీమ్ రంగులో ముద్రించిన సంప్రదాయ డిజైన్లు అందాన్ని మరింత పెంచాయి. భారీగా మడతలు ఉన్న ఈ స్కర్ట్ నడిచేటప్పుడు రాజసంగా కనిపించేలా చేసింది.
దుపట్టాను ధరించిన తీరు కూడా ప్రత్యేకంగా నిలిచింది. ఆధునిక స్టైల్‌కు భిన్నంగా గుజరాతీ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా సీధా పల్లూ పద్ధతిలో దుపట్టాను కప్పుకున్నారు. దానిపై ఉన్న భారీ ఎంబ్రాయిడరీ ముందు భాగంలో స్పష్టంగా కనిపించేలా జాగ్రత్తపడ్డారు.
ఆభరణాల విషయంలోనూ కంగనా సంప్రదాయానికే ప్రాధాన్యత ఇచ్చారు. పురాతన శైలిని తలపించే మందపాటి బంగారు చోకర్, దానికి సరిపోయే చెవిపోగులు, సున్నితమైన మాంగ్టికాను ధరించారు. జుట్టును మధ్యలో పాపిడి తీసి, వెనుకవైపు లో బన్‌గా కట్టుకుని తెల్లటి మల్లెపూల గజ్రాతో అలంకరించుకున్నారు. మేకప్‌ను మాత్రం చాలా సహజంగా ఉంచారు. కళ్లకు స్వల్పంగా మస్కారా, లేత పింక్-న్యూడ్ లిప్‌స్టిక్‌తో తన రూపానికి మరింత అందాన్ని తీసుకొచ్చారు.
నటిగా, దర్శకురాలిగా, రాజకీయ నాయకురాలిగా కొనసాగుతున్న కంగనా.. 2024 నుంచి హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.

