HomeENTERTAINMENTAnirudh-Kavya Maran Wedding: గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ వివాహం..అతిథులు వీరే! 

Anirudh-Kavya Maran Wedding: గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ వివాహం..అతిథులు వీరే! 

📰 Generate e-Paper Clip

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 10, 11 తేదీల్లో గ్రీస్‌లో వీరి వివాహ వేడుకలు జరగనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సూపర్‌స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ గ్రీస్‌కు బయలుదేరినట్లు సమాచారం.

అనిరుధ్ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు రజనీకాంత్ చెన్నై నుంచి గ్రీస్‌కు బయలుదేరారు. ఆయన చెన్నై విమానాశ్రయం నుంచి బయలుదేరిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానంలో సిబ్బందితో కలిసి రజనీకాంత్ ఫొటో దిగిన దృశ్యం కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది.

మరోవైపు ఎం.కె. స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ప్రయాణమయ్యారు. సోమవారం తెల్లవారుజామున 3.50 గంటలకు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వీరిద్దరూ విమానం ఎక్కగా దుబాయ్ మీదుగా గ్రీస్‌కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది.

ఈ వేడుకకు సినీ పరిశ్రమతో పాటు వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. అయితే వివాహ ఏర్పాట్లపై ఇరు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

కావ్య మారన్ ప్రముఖ వ్యాపారవేత్త, సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె. సన్ టీవీతో పాటు ప్రసార మాధ్యమాలు, వినోద రంగాల్లో సన్ గ్రూప్‌కు పలు వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఐపీఎల్‌లో సన్ గ్రూప్‌కు చెందిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కావ్యకు ప్రత్యేక అనుబంధం ఉంది. జట్టు మ్యాచ్‌లు, ఆటగాళ్ల వేలం సమయంలో ఆమె తరచూ కనిపిస్తుంటారు.

తమిళనాడులోని ప్రముఖ రాజకీయ, వ్యాపార కుటుంబాల్లో కావ్య మారన్ కుటుంబం ఒకటి. కళానిధి మారన్ దివంగత కేంద్ర మంత్రి మురసోలి మారన్ కుమారుడు. మురసోలి మారన్ మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అగ్రనేత ఎం. కరుణానిధికి మేనల్లుడు.

RELATED ARTICLES

Most Popular