HomeENTERTAINMENTTollywood:రాజమౌళి వారణాసికి రామాయణంకు లింక్..మహేష్‌ పాత్రపై ఇంట్రెస్టింగ్ బజ్‌!

Tollywood:రాజమౌళి వారణాసికి రామాయణంకు లింక్..మహేష్‌ పాత్రపై ఇంట్రెస్టింగ్ బజ్‌!

📰 Generate e-Paper Clip

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్‌స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం ఇప్పటివరకు పెద్దగా వివరాలు వెల్లడించలేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమా కథాంశానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ చిత్రం రామాయణంతో సంబంధం కలిగి ఉంటుందని ఇందులో మహేష్ బాబు కాలంలో ప్రయాణించే పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.

వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. రాజమౌళి సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర రావణుడి సోదరుడు కుంభకర్ణుడి పునర్జన్మగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. రామ-రావణ యుద్ధ సమయంలో వివిధ ఖండాల్లో చెల్లాచెదురైన తొమ్మిది శక్తివంతమైన రత్నాలతో కూడిన నవ రత్నమాలను తిరిగి సంపాదించుకోవడమే కుంభ లక్ష్యంగా ఉంటుందని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.

ఈ కథనం ప్రకారం.. ఆ తొమ్మిది రత్నాలను సేకరించే బాధ్యతను కుంభ, మహేష్ బాబు పాత్రకు అప్పగిస్తాడట. ఈ క్రమంలో మహేష్ బాబు పాత్ర ఒక వార్మ్‌హోల్ (కాలంలో ప్రయాణించేందుకు ఉపయోగపడే మార్గం) ద్వారా రామాయణ కాలానికి వెళ్తుందని సమాచారం.

అయితే ఆ తొమ్మిది రత్నాలను సొంతం చేసుకోవడం వెనుక కుంభకు ఉన్న అసలు ఉద్దేశాన్ని మహేష్ బాబు పాత్ర తెలుసుకుంటుందని ప్రచారం జరుగుతోంది. అతడి దుష్ట ఆలోచనలను అడ్డుకోవడానికి గతంలోకి వెళ్లి రామ-రావణ యుద్ధ సమయంలో జరిగిన ఓ కీలక సంఘటనలో జోక్యం చేసుకుంటాడట. తద్వారా ఆ తొమ్మిది రత్నాలు విడిపోకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తాడని వైరల్ పోస్టులో వెల్లడించారు.

అయితే సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ కథాంశంపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఈ వివరాలు నిజమా కాదా అన్నది తెలియాల్సి ఉంది.

ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. ఇప్పుడు మహేష్ బాబుతో కలిసి తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. వారణాసి చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular