తెలంగాణ రక్షణ సేన డిమాండ్‌కు ప్రభుత్వం స్పందించి ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక అభ్యున్నతికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు ఎంతో అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీ కమిషన్లను కలిపి ఒకే కమిషన్‌గా ఏర్పాటు చేశారని కవిత గుర్తుచేశారు. దీంతో రెండు వర్గాలకు సంబంధించిన సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించి పరిష్కరించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ఈ అంశాన్ని తమ పార్టీ పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందని తెలిపారు. ఎస్సీలు, ఎస్టీలు ఎదుర్కొంటున్న సామాజిక, భౌగోళిక సమస్యలు పూర్తిగా భిన్నమైనవని, వాటిని ఒకే విధంగా చూడటం సరికాదని అభిప్రాయపడ్డారు.
సమాజంలో ఎస్సీలు ఇప్పటికీ వివక్ష, అణచివేత, దౌర్జన్యాలను ఎదుర్కొంటున్నారని కవిత పేర్కొన్నారు. మరోవైపు ఆదివాసీలు, గిరిజనులు తమ నివాస ప్రాంతాల నుంచి దూరమయ్యే పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అడవితో ముడిపడిన వారి జీవన విధానం, సంప్రదాయాలు, హక్కులకు ముప్పు ఏర్పడుతోందని అన్నారు.
ముఖ్యంగా గిరిజనుల జీవనాధారమైన ‘జల్-జంగల్-జమీన్’ హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని కవిత స్పష్టం చేశారు. భూమి, అడవి, నీటిపై ఆదివాసీలకు ఉన్న హక్కులు, వారి అస్తిత్వం, సంస్కృతిని పరిరక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని గతంలోనే తాము డిమాండ్ చేసినట్లు గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గిరిజన సమాజానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
కొత్తగా ఏర్పాటు కానున్న ఎస్టీ కమిషన్ కేవలం ఫిర్యాదులను స్వీకరించే వ్యవస్థగా కాకుండా గిరిజనుల సమస్యలకు పరిష్కారం చూపే వేదికగా మారాలని కవిత ఆకాంక్షించారు. ఆదివాసీల ఆకాంక్షలు, ఆత్మగౌరవం, ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించేలా కమిషన్ పనిచేయాలని సూచించారు.
గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ, భూమి సమస్యలు, అటవీ హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రత్యేక కమిషన్ ఏర్పాటు నిర్ణయం ఆచరణలోకి వచ్చి గిరిజనులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

