HomePOLITICALBRS:ఇది అనావృష్టి కాదు..రేవంత్ వృష్టి, సీఎం తీరుపై హరీశ్ రావు ఫైర్

BRS:ఇది అనావృష్టి కాదు..రేవంత్ వృష్టి, సీఎం తీరుపై హరీశ్ రావు ఫైర్

📰 Generate e-Paper Clip

తెలంగాణలో ప్రస్తుత కరువు పరిస్థితులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రంలో నీటి వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని సమర్థంగా వినియోగించుకోలేకపోవడం వల్లే రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఇది అనావృష్టి కాదని.. రేవంత్ రెడ్డి వృష్టి అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నర్సాపూర్ నియోజకవర్గంలోని చిలిపిచెడ్, హత్నూర మండలాల్లో పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కోతల కారణంగా ఎండిపోయిన వరి పంట పొలాలను పరిశీలించి, నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసి వినియోగించకుండా గోదావరి జలాలను ఏపీకి వదిలేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీటిని ఒడిసిపడుతున్నారని పేర్కొన్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను ఎత్తిపోసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, 700 కిలోమీటర్ల దూరంలోని కుప్పం నియోజకవర్గానికి నీటిని తరలించారని విమర్శించారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల పేరుతో నీటిని వదిలేసి, పనులు చేపట్టకపోవడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో తాగునీటి సమస్య ఏర్పడిందని ఆరోపించారు.

ఇక రైతులు తమ పంటలు వేలాది ఎకరాల్లో ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరీశ్ రావు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. రైతుబంధు పూర్తిస్థాయిలో అందలేదని ఒక్క ఎకరానికే డబ్బులు జమ చేశారని ఫిర్యాదు చేశారు. రుణమాఫీ కూడా చాలామంది రైతులకు అందలేదని వాపోయారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ రైతులు అధైర్యపడవద్దని, వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఎండిపోయిన ప్రతి ఎకరానికి నష్టపరిహారం చెల్లించాలని, పెండింగ్ రైతుబంధు విడుదల చేయాలని, పూర్తిస్థాయి రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular