మురసు తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు, ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. శుక్రవారం బాపట్ల జిల్లాలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.
తొలుత సూర్యలంక చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి బాపట్ల మండలంలోని జిల్లెళ్లమూడికి బయలుదేరారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న డ్రెయిన్ల పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షపు నీరు సక్రమంగా బయటకు వెళ్లకపోవడానికి గల కారణాలు, తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీటినిల్వ సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
అనంతరం జిల్లెళ్లమూడి ప్రాంతంలో నీట మునిగిన వరి పొలాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. భారీ వర్షాలు, తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతినడంతో నష్టపోయిన రైతులతో నేరుగా మాట్లాడారు. సాగు కోసం ఎంత పెట్టుబడి పెట్టారు? ప్రస్తుతం పంట పరిస్థితి ఎలా ఉంది? ఎంత మేర నష్టం వాటిల్లింది? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి విపత్తు కారణంగా నష్టం జరగడం బాధాకరమని రైతుల ఆవేదనను విన్నారు.
పత్తిపాడు నియోజకవర్గంలోని రేటూరు ప్రాంతంలోనూ చంద్రబాబు పర్యటించి నీట మునిగిన వ్యవసాయ భూములను పరిశీలించనున్నారు. అనంతరం మరోసారి ఏరియల్ సర్వే నిర్వహించి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టం తీవ్రతను అంచనా వేయనున్నారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించిన అనంతరం నష్టంపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు సీఎం సూచించనున్నారు. రైతులకు త్వరితగతిన సహాయం అందించేలా చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ పర్యటన ద్వారా భరోసా కల్పించారు.

