ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ప్రతిష్ఠాత్మక హిందూ కాలేజీని ప్రైవేటు సంస్థల చేతుల్లోకి అప్పగించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 130 ఏళ్ల చరిత్ర, ఘనమైన వారసత్వం కలిగిన ఈ విద్యాసంస్థ ప్రత్యేకతను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని స్పష్టం చేశారు. కాలేజీని ప్రైవేటుపరం చేయాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ గత నెలన్నర రోజులుగా విద్యార్థులు, ప్రొఫెసర్లు, సిబ్బంది చేస్తున్న ఆందోళనకు ఆమె మద్దతు ప్రకటించారు.
బుధవారం ఢిల్లీలోని హిందూ కాలేజీకి వెళ్లిన కవిత.. అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను కలిసి వారి పోరాటానికి సంఘీభావం తెలిపారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. విద్యాసంస్థల స్వయం ప్రతిపత్తి, చారిత్రక గుర్తింపు, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
హిందూ కాలేజీకి 130 ఏళ్ల చరిత్ర ఉందని ఇక్కడి నుంచి ఎంతోమంది మేధావులు, ప్రముఖులు దేశానికి సేవలందించారని కవిత గుర్తుచేశారు. ఇలాంటి గొప్ప వారసత్వం ఉన్న విద్యాసంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు సమాజంపై కూడా ఉందన్నారు. ప్రైవేటు సంస్థలు కాలేజీ నిర్వహణకు నిధులు అందిస్తున్నాయనే కారణంతో, మొత్తం సంస్థపై వాటికి అధికారం కల్పించాలని చూడటం సరికాదని అభిప్రాయపడ్డారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ప్రకారం ప్రైవేటు సంస్థలు విరాళాలు లేదా ఆర్థిక సహాయం అందిస్తే, వాటికి నిబంధనల పరిధిలో పరిమిత సౌకర్యాలు కల్పించవచ్చని సూచించారు. అయితే నిధుల సాయాన్ని సాకుగా చూపి కాలేజీ నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తే అంగీకరించబోమని స్పష్టం చేశారు. విద్యాసంస్థలపై ప్రైవేటు పెత్తనం పెరిగితే భవిష్యత్తులో విద్యార్థుల ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
న్యాయబద్ధమైన ప్రతి పోరాటానికి తన మద్దతు ఉంటుందని కవిత స్పష్టం చేశారు. హిందూ కాలేజీ విద్యార్థులు చేస్తున్న ఉద్యమం న్యాయమైనదని, వారి డిమాండ్లను గౌరవించాలని పేర్కొన్నారు. కాలేజీ చారిత్రక గుర్తింపును, విద్యా స్వతంత్రతను కాపాడుతూ ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల పోరాటంలో తాము భాగస్వాములుగా ఉంటామని భరోసా ఇచ్చారు.
గత నెలన్నర రోజులుగా విద్యార్థులు, ప్రొఫెసర్లు, కాలేజీ సిబ్బంది నిరసనలు కొనసాగిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని కవిత ప్రశ్నించారు. విద్యార్థులు లేవనెత్తుతున్న సందేహాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ముఖ్యంగా కాలేజీ అడ్మిషన్లలో జరుగుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్న అవకతవకలు, సంస్థను ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల ఆందోళనలను పట్టించుకోకుండా వారి గొంతును నొక్కాలని చూస్తే ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని హెచ్చరించారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాల్సింది పోయి నిరసనలను నిర్లక్ష్యం చేయడం సరైన విధానం కాదన్నారు. విద్యార్థుల ఆందోళనలను కేంద్రం తక్షణమే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

