బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. ఉపాధి కోసం మస్కట్‌కు వెళ్లి అక్కడ ఇబ్బందుల్లో చిక్కుకున్న కొడంగల్‌కు చెందిన తుప్పుడు లక్ష్మిని సురక్షితంగా స్వదేశానికి రప్పిస్తానని ఇచ్చిన హామీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలబెట్టుకున్నారు. నెల రోజుల్లోనే తల్లిని ఇంటికి తీసుకొస్తానని ఆమె కుమారుడు రాజుకు ఇచ్చిన మాట ప్రకారం లక్ష్మి తిరిగి భారత్‌కు చేరుకున్నారు. స్వదేశానికి చేరుకున్న అనంతరం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను కలిసి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని గోకఫసల్వాడ గ్రామానికి చెందిన తుప్పుడు లక్ష్మి, ఆమె భర్త వెంకటప్ప ఉపాధి కోసం ఫిబ్రవరి 27న మస్కట్‌కు వెళ్లారు. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత ఏజెంట్ చెప్పిన పనికి భిన్నమైన పని అప్పగించడంతో లక్ష్మి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా యజమాని ఆమె పాస్‌పోర్టును తన వద్దే ఉంచుకుని స్వదేశానికి పంపించేందుకు నిరాకరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తమను విదేశాలకు పంపించిన ఏజెంట్ కూడా ఫోన్‌కు స్పందించలేదని, తిరిగి భారత్‌కు పంపించేందుకు రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు లక్ష్మి కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం. మరోవైపు వైఫై, సిమ్ కార్డు సేవలు నిలిచిపోవడంతో కుటుంబంతో ఆమెకు సంబంధాలు తెగిపోయాయి. చివరకు పక్కింటివారి ఇంటర్నెట్ సహాయంతో కుమారుడు రాజును సంప్రదించి తన పరిస్థితిని వివరించారు.
తల్లి పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న కుమారుడు రాజు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 29న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి తమ కుటుంబ పరిస్థితిని వివరించారు. సమస్యను విన్న కేటీఆర్.. నెల రోజుల్లోనే పాస్‌పోర్టు సమస్యను పరిష్కరించి, లక్ష్మిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని రాజుకు భరోసా ఇచ్చారు.
అనంతరం కేటీఆర్ సంబంధిత అధికారులకు లేఖ రాయడంతో పాటు లక్ష్మి తిరిగి రావడానికి అవసరమైన చర్యలు తీసుకున్నారు. దీంతో ఆమె సురక్షితంగా భారత్‌కు చేరుకున్నారు. ఈ విధంగా కుమారుడికి ఇచ్చిన హామీని నెల రోజుల్లోనే నెరవేర్చారు.
స్వదేశానికి చేరుకుని కుటుంబ సభ్యులను కలుసుకున్న లక్ష్మి.. తాజాగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను స్వయంగా కలిశారు. తన కుటుంబం కష్టాల్లో ఉన్న సమయంలో అండగా నిలిచి, తనను స్వదేశానికి రప్పించేందుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా లక్ష్మి భావోద్వేగంగా మాట్లాడుతూ.. నా కొడుకుకు కేటీఆర్ అన్న నెల రోజుల్లోనే నిన్ను ఇంటికి తీసుకొస్తానని మాట ఇచ్చారు. అన్న ఇచ్చిన మాట ప్రకారమే నన్ను సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చారు. నేను, నా కుటుంబం కష్టాల్లో ఉన్న సమయంలో ఆయన అండగా నిలిచారు. కేటీఆర్ చేసిన సహాయాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్నారు.

